Share News

Solar Power: సాగు భూముల్లో సౌర విద్యుత్తు!

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:15 AM

రాష్ట్రంలో సౌరవిద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ఇకపై రైతుల వ్యవసాయ భూముల్లో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఎవమ్‌ ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం కుసుమ్‌)లో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

Solar Power: సాగు భూముల్లో సౌర విద్యుత్తు!

  • రాష్ట్రంలో 4వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం

  • ఒక్కొక్కటి 0.5 - 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు చాన్స్‌

  • సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులకు ప్రాధాన్యం.. యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర

  • 6 ఎకరాలుంటే ఏటా రూ.25 లక్షల ఆదాయం

  • స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం

  • యూనిట్‌ విద్యుత్తు రూ.3.13 చొప్పున ధరకు కొనుగోలు చేయనున్న డిస్కమ్‌లు

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సౌరవిద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ఇకపై రైతుల వ్యవసాయ భూముల్లో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఎవమ్‌ ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం కుసుమ్‌)లో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఏడాదికి 300 రోజులపాటు సౌరవిద్యుత్తు ఉత్పాదనకు అనుకూలత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్‌కో)ను ఏజెన్సీగా నియమిస్తూ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పీఎం కుసుమ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అమల్లోకి తెచ్చింది. దీని కింద 2026 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో 30,800 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకంలో ఏ, బీ, సీ కాంపోనెంట్లు ఉండగా.. రైతులు వాణిజ్య ఉత్పాదన కోసం సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కాంపోనెంట్‌-ఏలో వెసులుబాటు ఉంది. 0.5 మెగావాట్‌ నుంచి 2 మెగావాట్ల దాకా ప్లాంట్‌లు పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనుంది. రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవే త్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రైతాంగానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


  • రూ.3.13కు యూనిట్‌ చొప్పున కొనుగోలు..

రైతుల వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధరకు డిస్కమ్‌ల (విద్యుత్తు ఉత్పత్తి సంస్థల)తో ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తుంది. ఈ మేరకు యూనిట్‌ ధరను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఇదివరకే ఖరారు చేసింది. రైతులు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్తును వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్తును డిస్కమ్‌లకు విక్రయించడానికి ఈ పథకంలో వెసులుబాటు ఉంది. కాగా, 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వారీగా ఏయేచోట ఎంత మేర సౌరవిద్యుత్తు ప్లాంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందో డిస్కమ్‌లు నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతుల నుంచి రెడ్‌కో దరఖాస్తులు స్వీకరించనుంది. అయితే రైతులు స్వయంగా లేదా సంఘాలుగా ఏర్పడటం, సహకార సంఘాల ద్వారా లేదా స్వయం సహాయక సంఘాలు లేదా మండల సమాఖ్యల ద్వారా ప్లాంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. భూములను లీజుకు తీసుకోవడం ద్వారా కూడా ప్లాంట్లు పెట్టుకునేందుకు వీలుంటుంది. సౌరఫలకాలు పెట్టే సంస్థల జాబితాను సిద్ధం చేయడం, వాటి ఏర్పాటుకు ఎంత వసూలు చేస్తారనే వివరాలను ప్రభుత్వానికి అందజేసే బాధ్యతను నోడల్‌ ఏజెన్సీగా ఉన్న రెడ్‌కో నిర్వహిస్తుంది. ప్లాంట్లు పెట్టుకోవడానికి వీలుగా బ్యాంకుల నుంచి ఒప్పందాలు చేయించే బాధ్యత కూడా రెడ్‌కోదే.


  • స్వయం సహాయక సంఘాలకే తొలి ప్రాధాన్యం

పీఎం కుసుమ్‌ కింద రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంఘాలసభ్యుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు చెందినవారే ఉండటంతో వారి ఆధ్వర్యం లో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ సంఘాల కు రుణాలు కూడా పావలా వడ్డీకే లభిస్తాయి. కాగా, ఒక మెగావాట్‌ ప్లాంట్‌ పెట్టుకుంటే ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.45 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఒక మెగావాట్‌ ప్లాంట్‌ పెట్టడానికి సౌరఫలకాలతోపాటు పరికరాలకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5కోట్ల దాకా వ్యయమవుతుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే.. ఏటా ప్లాంట్ల నిర్వహణ వ్యయానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా అయ్యే అవకాశముంది. ఇలా.. ఒక మెగావాట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బ్యాంకు రుణం, వడ్డీ, నిర్వహణ వ్యయం పోను ఏటా రూ.25 లక్షల దాకా ఆదాయం వస్తుందని అంచనా. ఒక మెగావాట్‌ ప్లాంట్‌ పెట్టడానికి 6 ఎకరాల భూమి అవసరం. ఈ లెక్కన ఏడాదికి ఎకరాకు రూ.4.5 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఈ పథకాన్ని అమలు చేసినందుకు డిస్కమ్‌లకు కేంద్రం మెగావాట్‌కు రూ.6.6 లక్షల దాకా ప్రొక్యూర్‌మెంట్‌ ఆధారిత ప్రోత్సాహకం (పీబీఐ) అందించనుంది.

Updated Date - Nov 14 , 2024 | 04:15 AM