Share News

Demolitions: హైడ్రాతో వ్యతిరేకత?

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:58 AM

రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.

Demolitions: హైడ్రాతో వ్యతిరేకత?

  • మారుతున్న ప్రజాస్పందన!.. ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు

  • దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు

  • ఉన్న అనుమతుల్ని పరిగణనలోకి తీసుకోవాలి

  • ఆక్రమణలకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ

  • అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి

  • తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి

  • ఎఫ్‌టీఎల్‌లో ఉంటే ముందుగా నోటీసులివ్వాలి

  • సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై.. దీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రజా స్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా.. పలు అంశాన్ని సూచించినట్లు తెలిసింది. ఇందులో.. హైడ్రా కూల్చివేస్తున్న పలు నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చితే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.


అనుమతులు చట్టవిరుద్ధమైనవైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల ఎఫ్‌టీఎల్‌ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తరువాతే కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. హైడ్రా కూల్చివేతలతో రియల్‌ ఎస్టేట్‌ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్లు తెలిసింది. హైడ్రా విషయంలో ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నమాట నిజమే అయినా.. అదే అందరి అభిప్రాయం కాదని చెప్పినట్లు సమాచారం. ‘‘హైడ్రాపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. అయితే ఇటీవలికాలంలో అది వ్యవహరించిన తీరుతో వ్యతిరేకత పెరుగుతోంది. దూకుడు ఉండాలి కానీ.. మధ్యతరగతి ప్రజలపై, పేదలపై ప్రతాపం చూపించకూడదు. ఆ విషయాన్ని హైడ్రా గుర్తించాలి. నష్టనివారణ చర్యలు చేపట్టాలి’’ అన్న భావన ప్రభుత్వానికి అందిన నివేదికలో వ్యక్తమైనట్లు తెలిసింది.


  • పొరపాట్లతో సమస్యలు..

హైడ్రా కార్యకలాపాలు సరైన రీతిలో జరగకపోతే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీదా పడుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతల సందర్భంగా కొన్నిసార్లు జరుగుతున్న పొరపాట్లు, తొందరపాట్లు చట్టపరమైన సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఎఫ్‌టీఎల్‌లో అనధికార నిర్మాణాలు తీవ్రమైన సమస్యే అయినప్పటికీ.. వాటి యజమానులు చట్టబద్ధమైన అనుమతులు కలిగి ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి విషయాలపై సరైన విధివిధానాలను సిద్ధం చేసుకోకుండా కూల్చివేతలు చేపట్టడం సమంజసం కాదు. చర్యలు తీసుకునే ముందు పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలించాలి. పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శించవద్దు. జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థలు, హెచ్‌ ఎండీఏ విభాగాలు ఇచ్చిన అనుమతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అనుమతుల అనంతరం నిర్మాణాల్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే.. వాటిని తొలుత గుర్తించి ఆ అనుమతుల్ని రద్దు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలి’’ అంటూ పలు నివేదికలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.


  • తగిన వ్యవధిలో నోటీసులివ్వాలి..

చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలపై చర్యలు తీసుకోవటానికి ముందు తగిన వ్యవధిలో నోటీసులు జారీ చేయాలని, దీంతోపాటు బాధితుల వివరణ కూడా తీసుకున్నాకే కూల్చివేతలపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఏమైనా ఆక్రమణలు ఉంటే మాత్రం నోటీసుల అవసరం లేకుండానే హైడ్రా చర్యలు తీసుకోవటం తప్పేం కాదన్న సూచన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ ఎంత అనే దానిని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలతో సమన్వయం చేసుకొని నిర్ధారించాలనే సూచన ఇచ్చినట్లు తెలిసింది. సరిహద్దుల లెక్క తేల్చిన తర్వాత నోటీసులిచ్చి ఎఫ్‌టీఎల్‌లోని అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.


ఇక హైడ్రా కూల్చివేతలపై వస్తున్న విమర్శల్లో ప్రధానమైనది.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేసిన తప్పులకు కొనుగోలుదారులు బలి అవుతున్నారన్న అంశం. దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే అంశాన్ని పలు విభాగాల వారు ప్రస్తావించినట్లు సమాచారం. నిర్మాణం పూర్తయి.. ఇప్పటికే యజమానుల అధీనంలోకి వెళ్లిన భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారు సూచించినట్లు తెలిసింది. భవనాలను కొన్నవారి ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. బ్యాంకుల్లో రుణాలు పొంది కొనుగోలు చేసిన భవనాలను కూల్చివేస్తే.. యజమానులు ఆ రుణాలను ఎలా చెల్లించాలి? బ్యాంకులు ఎలా రాబట్టుకుంటాయి? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని పేర్కొన్నట్లు తెలిసిదిఇ.


  • సోషల్‌ మీడియాపై మరింత ఫోకస్‌..

హైడ్రా చర్యలు ప్రారంభించిన మొదట్లో సోషల్‌ మీడియా నుంచి సానుకూల స్పందన వచ్చింది. కూల్చివేతల్ని స్వాగతిస్తూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తర్వాతి కాలంలో చోటుచేసుకున్న కూల్చివేతలతో సోషల్‌ మీడియా వైఖరి మారింది. ఇటీవల కాలంలో హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. పలువురు హైడ్రా తీరును ప్రశ్నిస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. బాధితుల ఆక్రందనలు, ఆవేదనలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు.. అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇదే విషయాన్ని పలు నివేదికలు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ వ్యతిరేక ప్రచారానికి దీటుగా ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లుగా తెలుస్తోంది. హైడ్రా చర్యలు తీసుకునే ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సిన ఉంటుందన్న సూచన చేసినట్లు సమాచారం.

Updated Date - Sep 28 , 2024 | 03:58 AM