Jishnu Dev Varma: బహుమతులుగా పుస్తకాలిద్దాం
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:45 AM
మానవ నాగరికత ఉన్నంతవరకు అచ్చు పుస్తకాలు వర్ధిల్లుతాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సందర్శన
మానవ నాగరికత ఉన్నంతవరకూ అచ్చు పుస్తకాలు వర్ధిల్లుతాయని వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, డిసెంబరు28(ఆంధ్రజ్యోతి): మానవ నాగరికత ఉన్నంతవరకు అచ్చు పుస్తకాలు వర్ధిల్లుతాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వివాహాది శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకల సందర్భంగా పుష్పగుచ్ఛాలు వంటి వాటికన్నా, పుస్తకాలు బహూకరించడం మంచి సంప్రదాయమని, దాన్ని ఆచరిస్తే బాగుంటుందని సూచించారు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను సమన్వయం చేయగలిగిన శక్తి పుస్తకానికే ఉందని వ్యాఖ్యానించారు. చదువరుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఆ సమాజం అంత బాగా పురోగమిస్తుందని నొక్కిచెప్పారు. దోమల్‌గూడ, ఎన్టీఆర్ స్టేడియంలోని 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవాన్ని శనివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా రచయిత్రుల స్టాల్ అక్షరయాన్, అక్షరాభ్యాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ గ్రంథాలయ శాఖ స్టాళ్లతో పాటు నేషనల్ బుక్ ట్రస్ట్, పబ్లికేషన్ డివిజన్, భూమి బుక్ ట్రస్ట్, నవచేతన స్టాళ్లలోని పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ‘భారత రాజ్యాంగం’ ఆంగ్ల పుస్తకాన్ని భూమి బుక్‌ట్రస్ట్ నిర్వాహకులు బహూకరించారు.
అనంతరం జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అచ్చు పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, కాగితపు సువాసనను ఆస్వాదిస్తూ, అక్షరాలను తడుముతూ చదువుతున్నప్పుడు కలిగే ఆనందం మాటలకు అందనిది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అచ్చుపుస్తకం చదువుతున్నప్పుడు రచయిత నేరుగా మనతో సంభాషిస్తున్న భావన మన సొంతమవుతుంది అని అన్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన పుస్తక సేకరణ నిధిని ఆయన ప్రారంభించారు. తద్వారా వచ్చిన పుస్తకాలను పల్లెగ్రంథాలయాలకు ఇవ్వనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ చెప్పడంతో, మంచి విషయం అంటూ వారిని గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డా.రియాజ్, బుక్‌ఫెయిర్ ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు పాల్గొన్నారు. జిష్ణుదేవ్‌వర్మను శాలువాతో సత్కరించారు.
మండలి డిప్యూటీ చైర్మన్ సందర్శన
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గత మూడు రోజులుగా హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి వస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన్ను పలకరించగా, ఒకేరోజు 350 స్టాళ్లలోని పుస్తకాలను చూడడం సాధ్యం కాదని, రోజూ కొన్నిస్టాళ్లను పరిశీలిస్తూ, నచ్చిన పుస్తకాలు కొనుక్కుంటున్నానని చెప్పారు. పుస్తక పఠనం తన జీవితంలో భాగమని, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సాహిత్యానికి తాను దగ్గరైనట్లు తెలిపారు.