Share News

Finance Ministry: ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు రూ.2వేల కోట్లు

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:05 AM

పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

Finance Ministry: ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు రూ.2వేల కోట్లు

ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో పనులు ప్రారంభం

విమానాశ్రయం నుంచి నాలుగో నగరానికి రహదారి

330 అడుగుల వెడల్పు.. 9 రేడియల్‌ రోడ్లలో ఇదే పెద్దది

ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం

ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబరు13 దగ్గర రావిర్యాల్‌ నుంచి ప్రారంభం

రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మాణం

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న 9 రేడియల్‌ రహదారుల్లో అతి పెద్దదైన ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు నిర్మించనున్న తొలి దశలో భాగంగా రావిర్యాల్‌ నుంచి అమనగల్‌ వరకు నిర్మించనున్న 41.5 కి.మీ రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2000 కోట్లు మంజూరు చేస్తూ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను, రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను అనుసంధానం చేస్తూ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబరు 13 రావిర్యాల నుంచి రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న ఈ రహదారి ఫ్యూచర్‌ సిటీ నుంచి వెళ్లి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్శిటీని చేరుతుంది. రెండుదశల్లో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు పనుల్లో తొలిదశలో 20 కి.మీ కోసం రూ.2000 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రేడియల్‌ రోడ్డు తొలిదశ కోసం ఆరు మండలాల్లోని 15 గ్రామాల్లో 916 ఎకరాలు సేకరించనున్నారు.


మహేశ్వరం మండలంలో కొంగరకుర్దు, కందుకూరు మండలం లెమూరు, తిమ్మాపూర్‌, రాచలూరు, గుమ్మడవెళ్లి, పంజాగూడ, మీర్ఖాన్‌పేట్‌, ముచ్చెర్ల, కడ్తాల్‌ మండలంలో కడ్తాల్‌, ముద్విన్‌, అమన్‌గల్‌ మండలంలో అమన్‌గల్‌, ఆకుతోటపల్లి, యాచారం మండలంలో కుర్మిద్ది, ఇబ్రహీంపట్నం మండలం ఫిరోజ్‌గూడ,, కొంగరకలాన్‌ ఉన్నాయి. 916 ఎకరాల్లో 568 ఎకరాలు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరణ చేయాల్సి ఉంది. 156 ఎకరాలు తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ)కు సంబంధించినది. 169 ఎకరాలు అటవీ భూమి, ఇతరుల ఆక్రమణలో ఉన్న అసైన్డ్‌ భూమి 23 ఎకరాలైతే ఈ ప్రాంతంలో భూముల విలువ రూ.కోట్లలో ఉండటంతో ప్రత్యేక పట్టణ ప్రణాళిక పథకం అమలు చేయడానికి పురపాలక శాఖ సన్నద్ధమైంది. రహదారికి ఇరువైపులా కిలోమీటరు వరకు ఉన్న భూములకు హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ పథకాన్ని అమలు చేయనుంది. సుమారు 519 ఎకరాలు మిగిలే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక వసతులకు కేటాయించగా మిగిలిన 354 ఎకరాల్లో 60 శాతం భూ యజమానుల వాటాగా, 40 శాతం హెచ్‌ఎండీఏ వాటాగా ప్రతిపాదించారు. భూసేకరణకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రకటన కూడా జారీ చేశారు.


2 నమూనాలతో ప్రతిపాదనలు

41.5 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు ఇరువైపులా సమీకరించే భూముల్లో లాజిస్టిక్‌ పార్కులు, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుచేయనున్న నేపథ్యంలో ఆ భూముల్లో లే అవుట్లు చిన్న చిన్న బిట్లుగా కాకుండా పెద్ద బిట్లు వచ్చేలా వేయనున్నారు. అంటే.. 200 గజాలు, 500 గజాలు ఇలా కాకుండా ఎకరం, రెండెకరాల నుంచి అవసరమైతే 10 ఎకరాల వరకు ఒకే బిట్‌ ఉండేలా అభివృద్ధి చేయనున్నారు. ఇంత పెద్ద బిట్లు వేస్తే ఒక ఎకరానికి రానున్న అభివృద్ధి చేసిన స్థలం కూడా పెరుగుతుంది. ఈ కారణంగానే ఒక ఎకరా.. లే అవుట్‌లో రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం 31.51 శాతం భూమి మాత్రమే పోగా, ఏకంగా 68.49శాతం మేర భూమి అభివృద్ధి చెందిన ప్లాటుగా వస్తుందని అంచనా. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు నమూనాలను కూడా సిద్ధం చేశారు. ఒక నమూనాలో కిలోమీటరు మేర, మరో నమూనాలో అర కిలోమీటరు మేర భూ సమీకరణ చేసి, వాటిలో లాజిస్టిక్‌ పార్కులు, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుచేస్తారు. ఈ రెండింటిలో ఏ విధానాన్ని అనుసరించినా సమీకరించిన భూములను ఎకరంన్నర నుంచి పదెకరాల వరకు పెద్ద పెద్ద బిట్లుగా వచ్చేలా లే అవుట్‌ను అభివృద్ధి చేయనున్నారు.


పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేలా లే అవుట్‌ ఉండనుంది. ఆ భూముల్లో రోడ్‌ ఏరియా (లే అవుట్‌లో రోడ్డు నిర్మాణం), సోషల్‌ ఇన్‌ఫ్రా ఏరియా, సౌకర్యాలకు, పార్కింగ్‌ కోసం భూమిని విభజించనున్నారు. సమీకరించిన భూములను అభివృద్ధి చేసి రోడ్లు, పార్కులు, సోషల్‌ ఇన్‌ఫ్రా ఏరియా, తదితర సౌకర్యాలకు పోగా మిగిలిన భూమిలో 60 శాతం రైతులకు ఇవ్వనున్నారు. 40 శాతం ప్రభుత్వం వాటాగా ఉంటుంది. ఒక ఎకరంలో రోడ్ల నిర్మాణం, సోషల్‌ ఇన్‌ఫ్రా, సౌకర్యాలకు, పార్కింగ్‌ ఏరియాలకు కలిపి 31.51శాతం మేర భూమి పోగా, మిగిలిన 68.49శాతం మొత్తంలో 60శాతం మేర.. అంటే 41.09 శాతం రైతులకు, మిగిలిన 27.39 (40శాతం) శాతం హెచ్‌ఎండీఏకు వాటా ఉండనుంది. ఒకవేళ అర ఎకరంలో అయితే సౌకర్యాల నిర్మాణాలన్నింటికీ కలిపి 36.27శాతం భూమి పోగా, మిగిలిన మొత్తం 63.73 శాతం మొత్తంలో 60శాతం మేర అంటే 38.23శాతం రైతులకు, మిగిలిన 25.49 శాతం హెచ్‌ఎండీఏకు వాటా ఉంటుంది.

Updated Date - Dec 25 , 2024 | 04:05 AM