Share News

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:56 AM

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్‌ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది.

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

దామగుండంలో రూ.2,500 కోట్లతో వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ నిర్మాణం

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానాలు

  • ఇందుకోసం 2,900 ఎకరాల అటవీ భూమి నేవీకి అప్పగింత

  • ‘సేవ్‌ దామగుండం’ అంటూ కొనసాగుతోన్న ఆందోళనలు

వికారాబాద్‌/ పరిగి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి ): వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్‌ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. 15వ తేదీ మంగళవారం రాడార్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్‌ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను నేవీ, రక్షణ శాఖ అధికారులు గురువారం స్వయంగా ఆహ్వానించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం.


  • ఏమిటీ వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ ?

వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్‌ అని అర్థం. ఈ వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గ్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ వ్యవస్థ 3కేజీహెచ్‌జెడ్‌ నుంచి 30 కేజీహెచ్‌జెడ్‌ రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తోంది. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు వెళతాయి. అలాగే, ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి సిగ్నల్స్‌ చేరవేయగలదు. రక్షణ రంగంతోపాటు ఇతర రేడియో కమ్యూనికేషన్‌ అవసరాలకు ఈ సాంకేతికతను వినియోగిస్తారు. దేశంలో ప్రస్తుతం ఒకేఒక్క వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉంది. ఇప్పుడు దామగుండంలో ఏర్పాటు చేయనున్నది రెండోది.


  • సముద్రంలేని తెలంగాణలో ఎందుకు

సముద్రం లేని తెలంగాణలో నేవీ.. రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఏంటనే సందేహం ఎవరికైనా కలుగక మానదు. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడడానికి వీలుగా ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉన్న తెలంగాణలోని దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎంచుకుంది. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉండడం, అటవీ ప్రాంతం కావడం, హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో ఉండడమే ఈ నిర్ణయానికి కారణం. రూ.2500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ నేవీ రాడార్‌ స్టేషన్‌ను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దామగుండం ప్రాంతంలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు కోసం నేవీ 14 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 2010 నుంచి 2023 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. కానీ అడుగు ముందుకు పడలేదు.


నేవీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు దామగుండం అటవీ భూములు అప్పగించాలని తూర్పు నౌకాదళ కమాండ్‌ పలుమార్లు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది. కేంద్రంతో విభేదాల వల్ల ఆయన ఈ అంశాన్ని పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగాయి. దామగుండం రిజర్వు ఫారెస్టులోని 2900 ఎకరాలను అటవీ అధికారులు జనవరి 24న సీఎం సమక్షంలో నావికాదళానికి అప్పగించారు. అంతకుముందే అటవీ భూములను అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కంపా నిధులు, భూసంరక్షణ పనులు చేపట్టేందుకు రూ.18.56 కోట్లు నేవీ చెల్లించింది. కాగా, 2900 ఎకరాల్లోని 1500 ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మొక్కలు, చెట్లు లేని ప్రాంతంలో 350 ఎకరాల్లో సుమారు 3వేల మంది నివాసముండేలా ఓ టౌన్‌షిప్‌ నిర్మిస్తారు. రాడార్‌ స్టేషన్‌లో 600 మంది విధులు నిర్వహించే అవకాశముంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నేవీ విస్తృతంగా మొక్కలు నాటనుంది.


  • స్థానికంగా తీవ్ర వ్యతిరేకత..

నేవీ వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. అడవిలోని 12 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, మూసీ నది పరీవాహక ప్రాంతం దెబ్బతింటుందని, అడవిలోని జీవవైవిధ్యం నాశనమవుతుందని, పురాతన శ్రీరామలింగేశ్వస్వామిదేవాలయానికి వెళ్లనీయకుండా నేవీ అడ్డుకుంటుందని పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ‘సేవ్‌ దామగుండం’ అంటూ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, ఇతర ప్రజా సంఘాలు, దామగుండం జేఏసీ ఉద్యమాలు చేస్తున్నాయి. నేవీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలంటూ సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


అలాగే, సేవ్‌ అనంతగిరి అని పేర్కొంటూ ప్రముఖ పర్యావరణవేత్త మేధాపాట్కర్‌ రెండు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ కూడా రాశారు. భూకేటాయింపు జరగకముందు.. రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు రద్దు కోరుతూ దామగుండం అటవీ సంరక్షణ జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వ షరతులన్నింటినీ పాటించాలని న్యాయస్థానం నేవీకి ఆదేశించింది. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులను అనుమతిస్తామని నేవీ స్పష్టం చేసింది. కాగా, రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటైతే 12 లక్షల మొక్కలు నరికివేతకు గురవవుతాయనే వ్యాఖ్యలను అటవీ శాఖ కొట్టిపారేసింది. నేవీకి ఇచ్చిన భూముల్లో ఉన్న 1..93 లక్షల చెట్లకు నష్టం జరగదని.. చెట్లు లేని చోటే నిర్మాణాలు చేపడతారని చెబుతోంది.

Updated Date - Oct 11 , 2024 | 03:56 AM