Share News

Harish Rao: మూసీపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:09 AM

తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు.

Harish Rao: మూసీపై బహిరంగ చర్చకు సిద్ధం

  • ఎక్కడకు రావాలో రేవంత్‌ చెప్పాలి

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ సవాల్‌

  • గుంట భూమి కూడా ఆక్రమించలేదు

  • సీఎంవి నిరాధార ఆరోపణలని విమర్శ

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు. కేంద్రాన్ని, పార్లమెంటును తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. మూసీపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. ఎక్కడకు రావాలో రేవంత్‌రెడ్డి చెప్పాలని సవాల్‌ విసిరారు. మూసీపై అఖిలపక్షాన్ని చర్చలకు పిలుస్తానన్న సీఎం తోక ముడిచారని ఎద్దేవా చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. సీఎంపై పార్లమెంట్‌లో హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని, మూసీపై బాధితుల పక్షాన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో మరింత మెరుగ్గా 2014లో భూసేకరణ చట్టం తెచ్చామని, అదే రాష్ట్రంలో అమల్లో ఉందని చెప్పారు. దానిప్రకారం ఎన్యుమరేషన్‌ జరగలేదని, పీడీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, డీపీఆర్‌ సిద్ధం చేయలేదని, లబ్ధిదారులను గుర్తించలేదని హరీశ్‌ ఆరోపించారు. రంగనాయకసాగర్‌ దగ్గర ఇరిగేషన్‌ భూములు ఆక్రమించానంటూ తనపై సీఎం నిరాధార ఆరోపణలు చేయడం తగదని హరీశ్‌ అన్నారు. ఒక గుంట భూమిని కూడా తాను ఆక్రమించలేదని..నిబంధనలకు లోబడి భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. భూఆక్రమణల చరిత్ర రేవంత్‌రెడ్డికే ఉందని, ఆక్రమణల్లో మునిగి తేలే ఆయనకు అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణలు చేసిన సీఎం.. ఎప్పుడు వస్తారో చెబితే ఆ భూమి దగ్గరే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.


  • 6,213 పాఠశాలలు మూసేందుకు కుట్ర

ఏడాది పాలనలోనే రాష్ట్రంలో 6213 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు కుట్ర చేస్తోందని హరీశ్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ప్రతి చిన్న గ్రామానికి ప్రాథమిక, ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఏమైందని నిలదీశారు. ఏడాది కాకముందే జీరో స్కూల్‌ పేరిట 1,899 బడులు, 10 మంది లోపు విద్యార్థులున్న 4,314 స్కూళ్లను మూసివేసే ప్రణాళికలో భాగంగానే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు.

Updated Date - Nov 29 , 2024 | 04:09 AM