Share News

Harish Rao: 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:36 AM

రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్‌ దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తప్పుదారి పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

Harish Rao: 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు

  • మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు

  • సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

  • యువత నిలదీయాలని పిలుపు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్‌ దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తప్పుదారి పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీకి సంబంధించి తాను సమాచార హక్కుచట్టం కింద గత నెల 25న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా సేకరించిన వివరాలను పొందుపరిచారు. రాష్ట్రంలో లక్షలోపు రుణం ఉన్న రైతులు 5,74,137 మంది కాగా, కేవలం 2,99,445 మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ జరిగిందన్నారు. అలాగే లక్ష నుంచి లక్షన్నర మధ్య రుణం ఉన్న రైతులు 2,62,341 మంది కాగా, ఇప్పటివరకు 1,30,915 మంది రైతులకే రుణమాఫీ అయిందన్నారు. ఎస్‌బీఐ నుంచి అందిన డేటా ప్రకారం సుమారు 5.5 లక్షల మంది రైతులుంటే, వారిలో సుమారు 50ు మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు.


ఇతర బ్యాంకులకూ దాదాపు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్నారు. 2లక్షలకు పైనున్న రుణాలను రైతులు చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. చాలా మంది రైతులు ఈ మొత్తాన్ని చెల్లించారని, అయినప్పటికీ ఎస్‌బిఐ నివేదిక ప్రకారం రుణమాఫీ జరగలేదన్నారు. చాలా మంది రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారి పంట రుణం మాఫీకి అర్హులు కావడానికి ప్రైవేటు రుణాలను అధిక వడ్డీకి తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పంట రుణమాఫీకి 31 విభిన్న షరతులను పెట్టి చాలా మంది రైతులను అర్హత కోల్పోయేలా చేశారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేసినట్లు దేశం మొత్తం తప్పుడు ప్రచారం చేసే ముందు, రైతులకు ఇచ్చిన మాఫీ హామీని పూర్తి చేయాలని సీఎంను హరీశ్‌ డిమాండ్‌ చేశారు. అలాగే పంట రుణానికి సంబంధించి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 6 గ్యారెంటీలతోపాటు రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్లపై కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలంటూ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.


  • రైతుల మృతికి రేవంతే కారణం: కేటీఆర్‌

ఒకేరోజు ముగ్గురు అన్నదాతలు బలి కావడానికి రేవంత్‌ సర్కారే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. దసరా పండుగవేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన రేవంత్‌కు రైతన్నల చేతిలో దండన తప్పదంటూ ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు.

Updated Date - Oct 07 , 2024 | 03:36 AM