Share News

Harish Rao: నిరుద్యోగులేమైనా హంతకులా?

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:46 AM

హక్కుల కోసం నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారేమైనా ఉగ్రవాదులా? హంతకులా? వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish Rao: నిరుద్యోగులేమైనా హంతకులా?

వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా?.. అన్ని వర్గాలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారు

  • సెక్యూరిటీ లేకుండా అశోక్‌ నగర్‌ వెళ్లే దమ్ముందా?

  • జీవో 29ను రద్దు చేయాలి: హరీశ్‌

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హక్కుల కోసం నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారేమైనా ఉగ్రవాదులా? హంతకులా? వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ హయాంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను జీవో నంబర్‌ 55 ప్రకారం అమలు చేశామని, రేవంత్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని కాదని జీవో నంబర్‌ 29 తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సిద్దిపేటలో హరీశ్‌ మాట్లాడారు.


నాలుగు రోజులుగా నిరుద్యోగ యువతపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దాడిని బీఆర్‌ఎస్‌ పక్షాన ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగం తమకు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ వంటిదని చెబుతున్న రేవంత్‌.. ఆ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితులు, బలహీన, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేయడమేనా కాంగ్రెస్‌ పాలసీ? అని నిలదీశారు. ఒకవైపు రాహుల్‌గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అదే రాజ్యాంగాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దళితులు, బలహీన, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేయడమేనా కాంగ్రెస్‌ పాలసీ? అని నిలదీశారు.


దీనిపై దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క అయినా స్పందిస్తారో? లేదో? వేచి చూడాల్సి ఉందన్నారు. విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్‌ దద్దరిల్లుతోందని, లాఠీచార్జీలు, ఇనుప కంచెలతో విద్యార్థుల ఆందోళనలను అణిచివేయడం సాధ్యం కాదని అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు కాదు.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు అశోక్‌నగర్‌కు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. కోదండరాం, రియాజ్‌, ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ నవీన్‌ తదితరులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. . జీవో 29ను రద్దు చేసి, జీవో 55నే కొసాగించాలన్నారు. వానాకాలం సీజన్‌ రైతు బంధు ఇవ్వబోమన్నట్టుగా మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారని, దీన్ని బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Updated Date - Oct 20 , 2024 | 03:46 AM