Share News

Harish Rao: తప్పుడు ప్రకటనలతో సీఎం స్థాయి తగ్గించకు

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:27 AM

ఉద్యోగాల భర్తీ గురించి వివరాలు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకో తప్పుడు ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రికి ఉండే స్థాయిని తగ్గించకని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Harish Rao: తప్పుడు ప్రకటనలతో సీఎం స్థాయి తగ్గించకు

  • బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు రేవంత్‌ మాటలు

  • పునరుజ్జీవం పేరుతో ప్రజాధనం లూఠీ: హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల భర్తీ గురించి వివరాలు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకో తప్పుడు ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రికి ఉండే స్థాయిని తగ్గించకని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఇచ్చిన 30 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి డబ్బా కొట్టుకుంటున్నావ్‌ అంటూ సీఎంను ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం ప్రకటించడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. సీఎం వంద సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవని తెలుసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.


గ్రూప్‌-1 విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను కాలరాస్తూ కర్కశంగా, కఠినంగా వ్యవహరించిన రేవంత్‌ను తెలంగాణ సమాజం క్షమించదని, నిరుద్యోగులను లాఠీలతో కొట్టి, అరెస్టులు చేసిన సీఎం వైఖరిని విస్మరించదని పేర్కొన్నారు. ఉద్యోగాల ఆశచూపి మోసంచేసి అధికారంలోకి వచ్చిన మీకు నిరుద్యోగులే బుద్ధి చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు. మూసీపై పూటకో మాట మాట్లాడుతున్న సీఎంను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని ఎద్దేవా చేశారు. పలు సందర్భాల్లో బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు డీపీఆర్‌ లేకుండా లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని చెప్పడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికే చెల్లుతుందని విమర్శించారు. మూసీ పేరుతో ప్రజాధనం లూఠీ చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.

Updated Date - Oct 22 , 2024 | 04:27 AM