Share News

Harish Rao: అప్పులపై ఆర్థిక నిపుణులతో చర్చకు సిద్ధమా?

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:18 AM

‘కాంగ్రెస్‌ సర్కార్‌.. ఉత్త బేకార్‌’ అని తెలంగాణ ప్రజలంతా తిట్టిపోస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మాది సుపరిపాలన అంటూ నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం కాదు రేవంత్‌రెడ్డీ..

Harish Rao: అప్పులపై ఆర్థిక నిపుణులతో చర్చకు సిద్ధమా?

  • రేవంత్‌కు సవాల్‌ విసిరిన హరీశ్‌

  • కాంగ్రెస్‌ పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు అని విమర్శ

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ సర్కార్‌.. ఉత్త బేకార్‌’ అని తెలంగాణ ప్రజలంతా తిట్టిపోస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మాది సుపరిపాలన అంటూ నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం కాదు రేవంత్‌రెడ్డీ.. జనం ఏమనుకుంటున్నారో తెలుసుకో! నీ అపరిపక్వత, అసమర్థతతో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఎవరూ మెచ్చుకునే పరిస్థితిలేదు’’ అని మండిపడ్డారు. ఆర్థికవృద్థితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక సీఎం నోటికొచ్చినట్లు వాగుతున్నారని హరీశ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అప్పు మొత్తం రూ.4,26,499కోట్లని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా నిరూపించామని, కానీ పదే పదే అప్పులపై సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై ఆర్థిక నిపుణులతో చర్చించేందుకు తాము సిద్ధమని, రేవంత్‌ సిద్ధమేనా? అని సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కోసం రూ.7,200కోట్ల నిధులు సిద్థం చేసి రైతుల ఖాతాల్లో వేేసందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకున్నామని, చివరి నిమిషంలో ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడి బుక్కను ఆపిన పాపాత్ముడు రేవంత్‌ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరెస్టులు, ఆంక్షలు, నిర్బంధాలు ఒకవైపు బూటకపు ఎన్‌కౌంటర్లు మరోవైపు కొనసాగుతూ అశాంతి రేపుతున్నాయని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌ విమర్శించారు.


  • సభతో రైతులకు ఒరిగిందేమీ లేదు: నిరంజన్‌ రెడ్డి

పాలమూరులో సీఎం సభతో రైతులు, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి నిరజంన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.7,500 కోట్లు రైతుబంధు ఇవ్వలేక చేతులెత్తేసిన వారు రూ.30వేల కోట్ల బోనస్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్కారు బూటకపు హామీలతో ప్రజల గొంతులు కోస్తోందని విమర్శించారు. పరిశ్రమల కోసం లగచర్లలో ఎప్పుడో భూములు గుర్తించామని, ఇప్పుడు కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనాలోచిత నిర్ణయాలతో పాలమూరు ప్రజలు మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితి తీసుకురావద్దన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 03:18 AM