Share News

Harish Rao: ఫిరాయింపులు.. దబాయింపులు.. బుకాయింపులు

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:07 AM

మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అధికారం కోసం ప్రజల్ని మోసగించడం ఆయన నైజమని ఆరోపించారు.

Harish Rao: ఫిరాయింపులు.. దబాయింపులు..  బుకాయింపులు

  • వీటితోనే కాంగ్రెస్‌ ఏడాది పాలన

  • మోసగించడం సీఎం రేవంత్‌రెడ్డి నైజం

  • మాట మార్చడంలో ఆయన పీహెచ్‌డీ

  • అరాచక పాలనపై 7న చార్జిషీట్‌: హరీశ్‌

  • కార్యకర్తలపై అక్రమ కేసులు సహించం

  • చేనేతపై జీఎస్టీని రాష్ట్రం చెల్లించాలి: కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అధికారం కోసం ప్రజల్ని మోసగించడం ఆయన నైజమని ఆరోపించారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే కాంగ్రెస్‌ ఏడాది పాలన సాగిందని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక, ఉన్న రైతుబంధునే ఇవ్వడం లేదని విమర్శించారు. కౌలు రైతులకూ ఇస్తామని సీఎం ఓవైపు చెబుతుండగా.. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతు భరోసా డబ్బులపై రైతు, కౌలు రైతు మాట్లాడుకోవాలని చెబుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని అన్నారు. రేవంత్‌ అరాచక, బుకాయింపు పాలనపై తెలంగాణ ప్రజల ముందు చార్జిషీట్‌ పెడతానని హరీశ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ సర్కారు పాలనా వైఫల్యం, మోసాలను ఈ నెల 7న ప్రజలకు పూర్తిస్థాయిలో వివరిస్తానని తెలిపారు. శిలా ఫలకాలపై సీఎం పేరు ఉండొద్దన్న రేవంత్‌.. ఇప్పుడు ఏకంగా ఫొటోనే వేయించుకుంటున్నారని ఆరోపించారు.


యూట్యూబ్‌ చానళ్లను గతంలో మెచ్చుకొని, ఇప్పుడు వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు.. బూటకపు ఎన్‌కౌంటర్లపై సీఎం అయ్యాక అనుసరిస్తున్న విధానాలను వీడియోల రూపంలో హరీశ్‌ వెల్లడించారు. గ్రూప్స్‌, పోటీ పరీక్షల వాయిదా, బతుకమ్మ చీరలు, ఎల్‌ఆర్‌ఎస్‌, కులగణన సర్వే, అక్రమ కట్టడాల కూల్చివేతలు, ఏక్‌ పోలీస్‌, మద్యం అమ్మకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన మాటలపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పోలీస్‌ కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని విమర్శించారు. ఏక్‌ పోలీసింగ్‌ విధానం తెస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని పోలీసు కుటుంబాలు డిమాండ్‌ చేస్తే.. పోలీసులతోనే వారి కుటుంబసభ్యులను అరెస్టులు చేయించారని ఆరోపించారు. ‘గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయమని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తే అది ప్రతిపక్షాల కుట్ర అన్నావ్‌. మేం డిమాండ్‌ చేస్తే తలకు మాసినోడే పరీక్షలు వాయిదా వేయమంటాడన్నావ్‌. చివరికి నువ్వే పరీక్షలు వాయిదా వేశావ్‌. ఇప్పుడు ఎవరు తలమాసినోడో నువ్వే చెప్పాలి’ అని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి.. దాని పరిధిలోని మల్లన్న సాగర్‌ ద్వారానే హైదరాబాద్‌కు నీళ్లు తెస్తా అంటున్నారని, ఆ ప్రాజెక్టు ఉన్నందుకే ఇక్కడ కోకాకోలా కంపెనీని ప్రారంభించారని గుర్తుచేశారు.


  • తెలంగాణభవన్‌ అంటే గుర్తుకొచ్చే పేరు శ్రీనివా్‌సరెడ్డి

  • పార్టీకి ఆయన సేవలు ఎనలేనివి: హరీశ్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణభవన్‌ అంటే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీనివా్‌సరెడ్డి అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీగా కేంద్ర కార్యాలయ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివా్‌సరెడ్డి చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో శ్రీనివారెడ్డికి బీఆర్‌ఎస్‌ ఆత్మీయసత్కారం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... శ్రీనివా్‌సరెడ్డి స్థానంలో రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రావుల చంద్రశేఖర్‌ రెడ్డిని తెలంగాణ భవన్‌కు ఇంచార్జిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అసమర్థ కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖకూ పనిలేకుండా పోయిందని మాజీమంత్రి జి.జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - Dec 03 , 2024 | 04:07 AM