Harish Rao: రా..నా ఆక్రమణలు నిరూపించు
ABN , Publish Date - Nov 22 , 2024 | 02:32 AM
రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.
ఎప్పుడొస్తావో చెబితే ఆ భూమి వద్దే ఉంటా.. ముఖ్యమంత్రికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
జోగిపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. తాను నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూమిని కొనుగోలు చేశానని, ఒక్క గుంట కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉందని, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే తాను ఆ భూమి వద్దకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని బదలాయించుకుని హరీశ్‌రావు రంగనాయక సాగర్‌లో ఫామ్‌హౌస్ నిర్మించారని వేములవాడలో బుధవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం మాసాన్‌పల్లిలోని పెద్దమ్మ ఆలయంలో గురువారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తనపై చేసిన ఆరోపణలకు స్పందించారు. ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు తన చరిత్రలోనే లేదని, ఆక్రమణల చరిత్ర ముఖ్యమంత్రికే ఉందంటూ ధ్వజమెత్తారు. ఆక్రమణలలో మునిగితేలే రేవంత్ రెడ్డికి అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయలేక ప్రతిపక్షంపై నిందలు వేస్తూ రేవంత్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. 11 నెలల కాలంలో సీఎం, ఆయన మంత్రులు చేసిందేమీ లేదని విమర్శించారు. లోపాలను ఎత్తిచూపుతున్న కేటీఆర్‌పై కేసులు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేద న్నారు. బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ రైతులు, సామాన్యుల పక్షాన మాట్లాడుతూనే ఉంటుందని చెప్పారు. ఇక, వరి కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి చెప్పే లెక్కలకు పొంతన లేదన్నారు. సన్నాలకు ఇస్తామన్న రూ.500 బోనస్ సంగతి పక్కనపెడితే కొనుగోళ్లు సరి గా లేక కనీస ధర కంటే రూ.500 తక్కువకు ధా న్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి రైతులకు ఎదురైందని హరీశ్‌రావు వాపోయారు. హరీశ్ వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీఎ్‌సటీపీస్ మాజీ చైర్మన్ భిక్షపతి స్వామి, జైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్న 8047 మంది కానిస్టేబుళ్లకు హరీశ్ రావు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రచారం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఈ కొలువులను తన ఖాతాలోనే వేసుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.