Harish Rao: కేసీఆర్‌కు అండగా గద్దర్
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:32 AM
తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు గద్దర్ అండగా నిలబడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ తన వంతు పాత్ర పోషించి పోరాటయోధుడిగా, తన పాటలతో ఉద్యమాలకు ఊపు అందించిన వీరుడిగా నిలిచారని మెచ్చుకున్నారు.
తన పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చిన విప్లవ వీరుడు
త్వరలో సిద్దిపేటలో గద్దర్ విగ్రహం: హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు గద్దర్ అండగా నిలబడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ తన వంతు పాత్ర పోషించి పోరాటయోధుడిగా, తన పాటలతో ఉద్యమాలకు ఊపు అందించిన వీరుడిగా నిలిచారని మెచ్చుకున్నారు. ‘గద్దర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గద్దర్ సాహిత్య పుస్తకాలను ఆదివారం సిద్దిపేటలోని విపంచికళా నిలయంలో హరీశ్‌రావు ఆవిష్కరించి మాట్లాడారు. విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం.. ప్రతి దాంట్లో గద్దర్ న్యాయం వైపు నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారని కొనియాడారు. సామాన్య పదాలతో ప్రజల హృదయాలల్లోకి చేరే విధంగా గద్దరన్న పాటలు ఉంటాయని, మలిదశ ఉద్యమంలో ఆయనతో కలిసి పని చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని గద్దర్ లెటర్ రాస్తే వారికి వెంటనే ఒక్క సంతకంతో జీతాలు పెంచి గద్దర్‌కు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. ‘తూప్రాన్‌లో నీళ్లులేవు.. హల్దీ వాగులో నుంచి వాటిక చెరువుకు లిఫ్ట్‌పెట్టాల’ని గద్దర్ కోరితే 8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభించామని గుర్తుచేశారు. త్వరలో సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ పేరిట తన తండ్రి పోరాటాన్ని రేపటి తరానికి తెలియజేస్తున్న గద్దర్ తనయుడు సూర్యంను ఈ సందర్భంగా హరీశ్‌రావు అభినందించారు.