Share News

Harish Rao: అప్పుడు ఫ్రీ.. ఇప్పుడు ఫీజులా?

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:42 AM

‘నాడు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట దోపిడీ చేస్తోంద ని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఫీజులెలా వసూలు చేస్తారు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Harish Rao: అప్పుడు ఫ్రీ.. ఇప్పుడు ఫీజులా?

  • ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయండి

  • సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ‘నాడు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట దోపిడీ చేస్తోంద ని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఫీజులెలా వసూలు చేస్తారు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ (భూముల క్రమబద్ధీకరణ) పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘బీఆర్‌ఎస్‌.. ఎల్‌ఆర్‌ఎస్‌ అయిపోయింది.


ఎంఆర్‌ఎస్‌ (మ్యారేజ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొస్తుందేమో? అని మీరు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల భారాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట ప్రజలపై మోపే యత్నం చేస్తోందన్నారు. ఉచితంగా అమలు చేయాలంటూ.. మీతోసహా మీ కేబినెట్‌ సహచరులుగా ఉన్న భట్టి, ఉత్తమ్‌, సీతక్క, కోమటిరెడ్డి అన్నారు. గెలిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా అమలు చేయాలి’ అని సీఎంను ఆయన డిమాండ్‌ చేశారు. ‘


అంతే కాకుండా ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా హైకోర్టులో పిల్‌ దాఖలు చేసారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభల్లో ఊదరగొట్టిన మీరు, మీ మంత్రులు.. ఇప్పుడు మాటమార్చి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు వసూలుచేయాలని నిర్ణయించడం మీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. మాది ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటున్న మీకు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాల ఆవేదన కనిపించడంలేదా?’ అనిప్రశ్నించారు. మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా రాష్ట్ర ప్రజలెవరూ ఒక్కరూపాయి కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించొద్దని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Aug 27 , 2024 | 04:42 AM