Share News

Harish Rao: రేవంత్‌రెడ్డిది చిట్‌చాట్‌ కాదు.. చీట్‌ చాట్‌!

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:55 AM

‘‘మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చేసేది చిట్‌చాట్‌ కాదు.. ‘చీట్‌ చాట్‌’ అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Harish Rao: రేవంత్‌రెడ్డిది చిట్‌చాట్‌ కాదు.. చీట్‌ చాట్‌!

  • కవిత బెయిల్‌ విషయంలో న్యాయం గెలిచింది

  • సుప్రీంకోర్టు తీర్పును సీఎం తప్పుబట్టడం నేరం

  • వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరదామా?

  • రంగనాథ్‌ తన ఆఫీస్‌ కూల్చుకుని ఇతర భవనాలపై పడాలి:హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చేసేది చిట్‌చాట్‌ కాదు.. ‘చీట్‌ చాట్‌’ అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. అబద్ధాలను సీఎం గోబెల్స్‌లాగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం హరీశ్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కవిత బెయిల్‌ విషయంలో సీఎం వ్యాఖ్యలను సుప్రీం తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేసిన హరీశ్‌.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం నేరమన్నారు. ‘‘వక్రబుద్ధి ఉంటే అన్నీ వంకరగానే కనిపిస్తాయి.


ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి బెయిల్‌ బీజేపీ ఇస్తేనే వచ్చిందా?’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత బెయిల్‌ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు. ‘‘సిసోడియాకు బెయిల్‌ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్‌ వస్తే బీజేపీతో లాలూచీ అంటారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన ‘వాల్మీకి’ కుంభకోణం పట్టపగలు జరిగిన నిలువుదోపిడీ లాంటిదని హరీశ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. తెలంగాణలోని తొమ్మిది కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు తెలుస్తోందని.. రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్‌ డబ్బులు ఎవరికి వచ్చాయో తేల్చడానికి ఈడీ విచారణ కోరేందుకు రేవంత్‌రెడ్డి ముందుకొస్తే.. తానూ వస్తానని పేర్కొన్నారు.


  • భూములు కొల్లగొట్టే కుట్ర

ఫోర్త్‌ సిటీ పేరుతో కాంగ్రెస్‌ పాలకులు భూముల దోపిడీకి కుట్ర చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కందుకూరులోని సర్వే నంబర్‌ 9లో 385 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు సర్వే చేస్తున్నారని, తుక్కుగూడలో సర్వేనంబర్‌ 895లో 25ఎకరాలు పేదరైతుల వద్ద బినామీల పేరిట తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్నవారి తమ్ముళ్ల పీఏల పేరిట ముచ్చర్లలో భూములు కొంటున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌ మొదట తన ఆఫీసును కూలగొట్టుకుని ఇతర భవనాలపై పడాలన్నారు.


నెక్లె్‌సరోడ్‌, లుంబినీపార్క్‌, హోటళ్లు, క్లబ్‌లు దేనికింద ఉన్నాయని ప్రశ్నించిన హరీశ్‌... ‘‘నాలాపై ఉన్న బుద్థభవన్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలను తొలుత కూల్చాలి’’ అని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం తగదని హితవు పలికారు. అలాగే.. రైతు రుణమాఫీపై రిపోర్టు ఇవ్వాలని తనను కోరడం హాస్యాస్పదమని, నివేదిక తానిస్తే.. ఇక రేవంత్‌రెడ్డి సీఎం పదవిలో ఉండడం ఎందుకని హరీశ్‌ ప్రశ్నించారు.


రుణమాఫీ సభకు రావాలని సీఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్‌ గాంధీ రాలేద ని విమర్శించారు. ‘‘ఆయన ఎప్పుడు హైదరాబాద్‌ వస్తారో చెప్పండి.. నేను ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకొని రేవంత్‌ సొంత గ్రామానికి తీసుకువెళ్లి రుణమాఫీ అయిందో లేదో రైతుల ద్వారా చెప్పిస్తాన’’ని హరీశ్‌ పేర్కొన్నారు. అలాగే.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతుంటే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంతే బాధ్యుడని గురువారం ఎక్స్‌ వేదికగా హరీశ్‌ విమర్శించారు.

Updated Date - Aug 30 , 2024 | 03:55 AM