Harish Rao: సన్నాలకు రూ.500 బోనస్ ఏదీ?
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:12 AM
రైతుల వద్ద కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సర్కారు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించలేని దుస్థితిలో సర్కారు: హరీశ్‌రావు
మర్రిగూడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతుల వద్ద కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సర్కారు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. తర్వాత స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వడ్లకు మద్దతు ధర చెల్లించడంలేదని మిర్యాలగూడలో రైతులు రాస్తారోకో చేస్తుంటే... ధాన్యానికి మద్దతు ధరతోపాటుసన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిపెడుతోందన్నారు.
ఇటీవల జగిత్యాల జిల్లా పర్యటనలో రైతులను అడిగితే కిలో సన్న వడ్లు కూడా కొనడంలేదని చెప్పారన్నారు. సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి మద్యం విక్రయంపై ప్రేమ ఎక్కువైందన్న ఆయన.. మద్యం విక్రయాలకు టార్గెట్ పెట్టి ఆదాయం పెంచాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, మెమోలిస్తూ బదిలీ చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. రూ.15వేల రైతు బంధును రైతులకు ఇవ్వాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. హరీశ్ వెంట మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.