Share News

Harish Rao: రెసిడెన్షియల్‌ స్కూళ్లను పట్టించుకోండి

ABN , Publish Date - Nov 06 , 2024 | 02:22 AM

రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Harish Rao: రెసిడెన్షియల్‌ స్కూళ్లను పట్టించుకోండి

  • వసతుల కల్పనలో సర్కారు విఫలం: హరీశ్‌

  • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు పరామర్శ

సనత్‌నగర్‌/హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రెసిడెన్షియల్‌ స్కూళ్లలో వసతుల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను, వారి కుటుంబ సభ్యులను మంగళవారం హరీశ్‌ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కొద్దికాలంగా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని చెప్పారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే అనడంలో తప్పులేదన్నారు.


సరాసరిగా నెలకు ముగ్గురు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యార్థులు మరణిస్తున్నారని, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయని హరీశ్‌ రావు ఆరోపించారు. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయొద్దన్నారు.ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకం దిగజార్చకండి అంటూ సీఎం రేవంత్‌కి బహిరంగ లేఖరాశారు. సమగ్ర కుటుంబ సర్వేకోసం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలన్న నిర్ణయం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన అవుతుందన్నారు. సర్వే విధుల నుంచి వారికి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - Nov 06 , 2024 | 02:22 AM