Share News

Harish Rao : ఆ పది మందిపై అనర్హత వేటు వేయండి

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:17 AM

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రత్యేకంగా కలిశారు. అధికారం కోల్పోయాక.. ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా స్పీకర్‌ను కలవడం ఇదే మొదటిసారి.

Harish Rao : ఆ పది మందిపై అనర్హత వేటు వేయండి

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి

  • అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్లు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రత్యేకంగా కలిశారు. అధికారం కోల్పోయాక.. ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా స్పీకర్‌ను కలవడం ఇదే మొదటిసారి. అయితే ముందుగానే ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్న వారు.. మంగళవారం ఉదయం 11గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎ్‌సఎల్పీలో సమావేశమై.. స్పీకర్‌తో ఏయే అంశాలు చర్చించాలి.. క్షేత్రస్థాయి పరిస్థితులను ఏవిధంగా వెల్లడించాలన్న దానిపై సమాలోచన చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్‌ వద్దకు వెళ్లి ఆయనకు పలు విజ్ఞాపనలు చేశారు.

ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన 10మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని, వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు పిటిషన్లు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. 2020లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్‌ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. దాని ప్రకారం 10మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వారు విన్నవించారు. పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్‌ అమలు చేయడంలేదని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రొటోకాల్‌ ఉల్లంఘనను కట్టడి చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై దృష్టి సారించి.. పరిష్కరించాలని వారు కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌; ముఠాగోపాల్‌, మాగంటి గోపీనాథ్‌, కల్వకుంట్ల సంజయ్‌, కేపీ వివేకానంద ఉన్నారు.


సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: కేటీఆర్‌

ఢిల్లీలో బడేభాయ్‌ నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే.. ఇక్కడ చోటేభాయ్‌ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విభాగాలను ప్రయోగించి తమ పార్టీ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారి సొంత ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, విజిలెన్స్‌ దాడులతో బెదిరించడంతోపాటు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత.. ప్రజా ప్రతినిధులుగా తమకు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులే అక్కడ ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Jul 17 , 2024 | 04:18 AM