Share News

Harish Rao: బీఏఎస్ పథకానికి నిధులు విడుదల చేయాలంటూ భట్టికి హరీష్ బహిరంగ లేఖ

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:50 AM

25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.

Harish Rao: బీఏఎస్ పథకానికి నిధులు విడుదల చేయాలంటూ భట్టికి హరీష్ బహిరంగ లేఖ

హైదరాబాద్: 25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న 80 కోట్ల బీఏఎస్ పథకం నిధులతో పాటు, ఈ ఏడాది130 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదని పేర్కొన్నారు. దీని కారణంగా 25 వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వెంటనే బీఏఎస్ పథకం నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని హరీష్ పేర్కొన్నారు.


హరీష్ లేఖ యథాతథంగా..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను (BAS ) ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేట్ స్కూళ్లలో విద్య కోసం నిర్వహిస్తుండడం మీకు తెలిసిందే. ఈ స్కూళ్లలో మొత్తం 25,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఇందులో 18,000 మంది ఎస్సీ కేటగిరీకి, 7,000 మంది ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు చదువుతున్నారు. ఈ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులందరూ బడుగు బలహీనవర్గాల పిల్లలే. ముఖ్యంగా అణచివేతకు గురైన వర్గాలకు సంబంధించిన వారు. తమ కుటుంబాలలో చదువుకుంటున్న తొలి తరం వారు. ఎక్కువ మంది జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరం. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 130 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తోంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డే స్కాలర్స్‌‌గా ఉన్న ప్రతి విద్యార్థికి 28,000 రూపాయలు, హాస్టల్‌లో చదువుకునే విద్యార్థులకు రూ.42,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.


ఈ పథకాన్ని 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ప్రారంభించారు ప్రారంభించినప్పుడు ఈ పథకంలో కేవలం 8000 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. అందులో 5 వేల మంది ఎస్సీ, 3వేల మంది ఎస్టీ విద్యార్థులకు, డే స్కాలర్లకు ఒక్కో విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలు, హాస్టల్లో చదివే వారికి 20 వేల రూపాయల చొప్పున అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీనికోసం రాష్ట్రంలో 80 ప్రైవేట్ స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసింది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరు కూడా మార్చకుండా, రాజకీయాలు చేయకుండా కొనసాగించిన పథకాల్లో ఇది ఒకటి. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించే ఈ స్కీమ్ ను యధావిధిగా కొనసాగించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప మనసుతో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాక 80 పాఠశాలలను 150 కి పెంచుతూ 8 వేల మంది విద్యార్థులకు అవకాశముండే ఈ పథకాన్ని 25 వేల మంది విద్యార్థులు ప్రతి ఏటా చదువుకునే విధంగా విస్తరించారు.


అంతేకాక ప్రతి విద్యార్థి మీద ఖర్చు చేసే నిధులను కూడా డే స్కాలర్ విద్యార్థులకు 8 వేల నుంచి 28 వేలకు, హాస్టల్ విద్యార్థులకు 20 వేల నుంచి 42 వేలకు పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో సకాలంలో నిధులు కేటాయించి, విడుదల చేసి ఈ పథకానికి ఎలాంటి ఆటంకం కలగకుండా వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. ఎంతోమంది విద్యార్థులను దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విద్యాలయాల్లో ప్రవేశం పొందేలా పాఠశాలల్లోనే ఐఐటి, త్రిబుల్ ఐటీ విద్యను కూడా బోధించే అవకాశాలు కల్పించింది. ఉపముఖ్యమంత్రిగానే కాకుండా, ఆర్థిక మంత్రిగా మీరు ఉండి కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం. అట్టడుగు వర్గాల పిల్లలు చదువులో రాణించాలనే గొప్ప ఆశయంతో కొనసాగించిన ఈ పథకానికి ప్రతి సంవత్సరం 130 కోట్లు నిధులు మంజూరు చేసినట్టుగానే 2023 -24 విద్యా సంవత్సరానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది.


ఇందులో మొదటి విడత 50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రెండో విడత నిధులు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడం వల్ల నిధులు విడుదల చేయలేకపోయాం. ఆ తర్వాత ఏర్పడిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సిన 80 కోట్లను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించింది. ఈ పాఠశాలలో చదువుతున్న 25 వేల మంది విద్యార్థులు, పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకునే వారు లేరు. ఇప్పుడు 2024- 25 సంవత్సరంలో విద్యాసంస్థలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పాత బకాయిలు విడుదల కాక, ఈ విద్యా సంవత్సరం మొదటి టర్మ్ స్కాలర్షిప్ నిధులు విడుదల కాక పాఠశాలలు అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ఈ పాఠశాలలలో చదువుతున్న 25 వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం. ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే ఈ పథకాన్ని నీరుగార్చకుండా కొనసాగించాలని కోరుతూ. వెంటనే పెండింగ్ బకాయిలతో పాటు,ఈ విద్యాసంస్థలకు మొదటి టర్మ్ స్కాలర్షిప్ నిధులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Updated Date - Aug 24 , 2024 | 11:50 AM