Share News

Karimnagar: అమ్మ చనిపోయినా కూతుళ్లు రాలే..

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:37 AM

కొడుకు మూర్ఖుడైనా, కూతురుంటే కనీసం అన్నం పెడుతుందంటారు. అందుకే సంతానంలో ఒక్క ఆడపిల్లైనా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ముగ్గురు ఆడపిల్లలుండి కూడా తమ కన్నతల్లి చనిపోతే కనీసం చూడటానికి రాని హృదయవిదారక ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగింది.

Karimnagar: అమ్మ చనిపోయినా కూతుళ్లు  రాలే..

  • ముగ్గురున్నా ఒక్కరు రాలేదు

  • ఆశ్రమంలోనే అంత్యక్రియలు

  • కరీంనగర్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన

రామడుగు, నవంబరు 24 (ఆంద్రజ్యోతి): కొడుకు మూర్ఖుడైనా, కూతురుంటే కనీసం అన్నం పెడుతుందంటారు. అందుకే సంతానంలో ఒక్క ఆడపిల్లైనా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ముగ్గురు ఆడపిల్లలుండి కూడా తమ కన్నతల్లి చనిపోతే కనీసం చూడటానికి రాని హృదయవిదారక ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగింది. మండలంలోని వెదిర గ్రామానికి చెందిన దుర్గమ్మ(65)... భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అందిరికి వివాహం చేసింది. ఆమెకు సొంతంగా ఇళ్లు కూడా లేదు. కొంతకాలం పాటు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవితం వెళ్లదీసింది.


వృద్ధాప్యం మీద పడి పనులు చేసుకోలేని స్థితికి చేరుకున్నా కూడా కూతుళ్లు ఆమెను చేరదీయలేదు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో తనను కూతుళ్లు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని దుర్గమ్మ రామగుడు పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కూతుళ్లకు ఫోన్‌ చేస్తే తమకు తల్లికి సంబంధం లేదంటూ సమాధానం చెప్పారు. దీంతో పోలీసులే వెలిచాల గ్రామంలోని స్పందన అనాథ ఆశ్రమంలో చేర్పించారు. అయితే దుర్గమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఆమె మృతిచెందింది. మృతివార్తను కూతుళ్లకు ఆశ్రమ నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్‌ తెలియజేసినా వారు రాలేదు. దీంతో శ్రీనివాసే దుర్గమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - Nov 25 , 2024 | 03:37 AM