Share News

Heavy Rainfall: భద్రాద్రి జిల్లాలో కుండపోత..

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:39 AM

భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Heavy Rainfall: భద్రాద్రి జిల్లాలో కుండపోత..

  • పెరిగిన గోదావరి.. రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వానలు

  • వరద బాధిత కుటుంబాలకు 16,500: పొంగులేటి

  • రేపు తెలంగాణకు కేంద్ర బృందం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • పొంగిన వాగులు, వంకలు

  • చెరువులో పడి ఒకరి మృతి

  • పెరిగిన గోదావరి నీటిమట్టం

  • నేడు, రేపు మోస్తరు వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అక్కడక్కడ పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్ద గొల్లగూడెంలో చింతలచెరువులో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పడి మృతి చెందాడు. అఽశ్వారావుపేటలో 8 సెం.మీ., టేకులపల్లిలో 4.6, ఇల్లందులో 4.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జూలూరుపాడు మండలంలో గుండెపుడిలోని చెరువు కట్ట కోతకు గురైంది. అధికార యంత్రాంగం మరమ్మతులు చేపట్టింది. గోధుమవాగు పొంగి ప్రవహించడంతో పెనుబల్లి వద్ద వంతెనపైకి నీరు రావటంతో రాకపోకలను నిలిపేశారు.


చర్ల మం డలం తాలిపేరు నుంచి 24 గేట్లు ఎత్తి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో 2 గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 25.3 అడుగులున్న నీటిమట్టం.. సాయంత్రం 6 గంటలకు 29.6 అడుగులకు చేరింది. మంగళవారం తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకునే అవకాశాలున్నట్లు సమాచారం. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గత రెండ్రోజుల నుంచి సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.


ఇక సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 78 మండలాల్లో 1 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు నిలకడగా వరద వచ్చిచేరుతోంది. సోమవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కులు, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 65 వేలు, జూరాల ప్రాజెక్టుకు 2.05 లక్షలు, తుంగభద్రకు 34 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.54 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 2.27లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 2.04 లక్షల క్యూసెక్కులు ఉండగా.. 1.37లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు 42 వేలు, శ్రీపాద ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3.51 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం)కు 6.37 లక్షలు, దుమ్ముగూడెంకు 3.58 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.


  • నేడు, రేపు వర్షాలు..

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆయా జిల్లాలకు యెల్లోఅలెర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Sep 10 , 2024 | 06:52 AM