TG : పోలింగ్ డే.. కూల్ కూల్
ABN , Publish Date - May 14 , 2024 | 04:19 AM
పార్టీల నేతలు, కార్యకర్తలను పోలింగ్ డే హీటెక్కిస్తే.. భానుడు మాత్రం శాంతించాడు. ఆదివారం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పోలింగ్ రోజైన సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఒక్కరోజులో 5డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు
పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల బారులు
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పార్టీల నేతలు, కార్యకర్తలను పోలింగ్ డే హీటెక్కిస్తే.. భానుడు మాత్రం శాంతించాడు. ఆదివారం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పోలింగ్ రోజైన సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో ఈ మార్పు కనిపించింది. ఒక్కరోజు ముందు వరకు రాష్ట్రంలో 46డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ఉండగా.. ఎన్నికల రోజు 41 డిగ్రీలకు తగ్గాయి.
దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62శాతం పోలింగ్ నమోదవ్వగా ఈసారి అంతకుమించి నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
కాగా, రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.