High Court: నిజాం కూడా ఇలా భూములు పంచలేదు
ABN , Publish Date - Nov 15 , 2024 | 04:42 AM
ఓ ప్రైవేటు ఆస్తికి సంబంధించిన కేసులో వారసత్వ ధ్రువపత్రాన్ని అక్రమంగా జారీ చేసిన అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ భూదాన్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అమోయ్ పై ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులున్నాయి
మీరు మరో కేసు పెడతారా?
భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఓ ప్రైవేటు ఆస్తికి సంబంధించిన కేసులో వారసత్వ ధ్రువపత్రాన్ని అక్రమంగా జారీ చేసిన అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ భూదాన్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సదరు అధికారిపై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి.. చాలా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. క్రిమినల్ కేసులకు పెట్టింది పేరుగా ఉన్నారు. మీరు పత్రికలు చదవడం లేదా? ఇప్పుడు మీరు మరో కేసు పెట్టాలనుకుంటున్నారా? నాకు తెలిసి నిజాం రాజు కూడా ఈ స్థాయిలో ఆస్తులను ఎవరికీ కేటాయించలేదనుకుంటా’’ అని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అసలు భూదాన్ భూములకు పట్టా పాస్‌పుస్తకాలు జారీ చేస్తుంటే తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఏం చేస్తోందని బోర్డు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. భూదాన్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్లు నిజమైనవా ? కాదా ? అనే అంశంపై ఈ కోర్టులో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఆ భూములను రక్షించడానికి బోర్డు ఏం చర్యలు తీసుకుంటోంది? అని నిలదీసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయకపోతే రూ.25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.