Share News

High Court: మేమే పర్యవేక్షిస్తాం..

ABN , Publish Date - Nov 15 , 2024 | 04:38 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని చెరువులు, జల వనరులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ హద్దులు గుర్తించాలని, ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చేయాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

High Court: మేమే పర్యవేక్షిస్తాం..

  • మేమే పర్యవేక్షిస్తాంహెచ్‌ఎండీఏ పరిధి జల వనరులకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించండి

  • ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయండి

  • ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేదాకా పరిశీలిస్తాం

  • హెచ్‌ఎండీఏ, సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

  • ప్రత్యేకంగా సుమోటో పిటిషన్‌ నమోదు

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని చెరువులు, జల వనరులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ హద్దులు గుర్తించాలని, ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చేయాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే వరకు ఈ వ్యవహారాన్ని తామే పర్యవేక్షిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా సుమోటోగా పిటిషన్‌ నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలిలోని రామమ్మ కుంటను ఆక్రమించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌మెంట్‌ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) భవనం నిర్మించారని హ్యూమన్‌రైట్స్‌ అండ్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అనే సంస్థ 2023లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది. జూలై 24న ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని జలవనరుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లను గుర్తిస్తూ ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదించారు. నవంబరు 14 నాటికి 464 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామని తెలిపారు. మరో 3,068 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరారు.


  • పిల్‌ వేశాక పిటిషనర్‌కు హక్కులు ఉండవు..

ప్రభుత్వం అన్ని చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరింత సమయం ఇవ్వాలని కోరడాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 5 శాతం చెరువులకు కూడా ఎఫ్‌టీఎల్‌ ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని అన్నారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే వ్యతిరేక పిటిషన్‌ కాదని.. ఒక్కసారి పిల్‌ ద్వారా విషయం కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత సదరు అంశంపై పిటిషనర్‌ హక్కును కోల్పోతారని.. దానికి సరైన ముగింపునకు తీసుకొచ్చే బాధ్యత తమపై ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు పిటిషన్‌ దాఖలైంది ఒక్క రామమ్మ కుంట గురించి మాత్రమేనని.. తాము సుమోటోగా హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల వివరాలు కోరామని వ్యాఖ్యానించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఫైనల్‌ నోటిఫికేషన్‌ అంశాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సుమోటో పిటిషన్‌ నమోదు చేస్తామని వ్యాఖ్యానించింది.


ఈ మేరకు ప్రత్యేకంగా పిటిషన్‌ రిజిస్టర్‌ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. ఇక రామమ్మ కుంట బఫర్‌ జోన్‌లో అక్రమంగా ఎన్‌ఐటీహెచ్‌ఎం భవనం నిర్మించారన్న అంశంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. సదరు కుంటకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లోని హద్దుల ప్రకారం బఫర్‌జోన్‌లో ఉన్న ఎన్‌ఐటీహెచ్‌ఎం భవనంలోని భాగాన్ని తొలగించామని పేర్కొన్నారు. దీనిని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. అక్రమ నిర్మాణాల్లో కొంతభాగం మాత్రమే తొలగించారని.. అక్కడికి వెళ్లి పరిశీలించడానికి తమను అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త సర్వేకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆ వాదనలను అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా పడింది.

Updated Date - Nov 15 , 2024 | 04:38 AM