Siddipet: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులివ్వండి
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:54 AM
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సిద్దిపేట రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తన నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం లేదంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మొత్తం 474 చెక్కులు పంపిణీ చేయకుండా పెండింగ్‌లో పెట్టారని.. వాటిని అందజేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెక్కులకు కాలం చెల్లిపోలేదన్నారు. పిటిషనర్ అసత్య ఆరోపణలతో కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ శరత్ ధర్మాసనం.. పెండింగ్‌లో ఉన్న చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ముగించింది.