Hyderabad: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి
ABN , Publish Date - Sep 24 , 2024 | 04:03 AM
దుర్గం చెరువు పూర్తి స్థాయి నీటి నిల్వ (ఎఫ్‌టీఎల్)కు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆరు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలి
అప్పటిదాకా కూల్చివేతలు చేపట్టవద్దు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువు పూర్తి స్థాయి నీటి నిల్వ (ఎఫ్‌టీఎల్)కు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తు తరాల కోసం చెరువులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గుట్టలబేగంపేటలోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్లాట్ల యజమానులు, పిటిషనర్ల అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపింది. అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోపు మాదాపూర్‌లోని దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, లేక్ ప్రొటెక్షన్ కమిటీ తదితరులకు ఆదేశాలు జారీచేసింది. 2014లో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి.. ఇప్పటివరకు తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధి రికార్డుల ప్రకారం 65 ఎకరాల్లో మాత్రమే ఉందని.. అధికారులు 160 ఎకరాల్లో విస్తరించి ఉందని చెప్పడం చెల్లదని పేర్కొంటూ అమర్ కో ఆపరేటివ్ సొసైటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర ప్లాట్ల యజమానులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున అవినాశ్ దేశాయి, రాయ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇంజినీరింగ్ ప్రమాణాలు, అధికారిక రికార్డుల ప్రకారం ఎఫ్‌టీఎల్ 65 ఎకరాలు మాత్రమే అన్నారు. 160 ఎకరాలు అని ఎక్కడా లేదని చెప్పారు. తమవి పట్టా భూములని, హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్ అని.. అధికారులు ఎక్కడ కూల్చివేస్తారోనన్న భయంతో బతకాల్సి వస్తోందని పేర్కొన్నారు. 2014లో ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు తమ అభ్యంతరాలను స్వీకరించడం లేదని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌లు పేర్కొంటున్న రికార్డులు తప్పన్నారు. వాటిని ట్యాంపరింగ్ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ ఎంత ఉందో చెప్పడం తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ముందు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తేనే విస్తీర్ణం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. పిటిషనర్ల అభ్యంతరాలు విన్న తర్వాతే తుది నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపింది. ‘నేటి నుంచి వారంలోపు పిటిషనర్లు 2014 నాటి ప్రాథమిక నోటిఫికేషన్‌కు అభ్యంతరాలు తెలపాలి. అక్టోబరు 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరై అభ్యంతరాలను వివరించాలి. వాటిపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. తర్వాత ఎఫ్‌టీఎల్ తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లో పూర్తి కావాలి. అప్పటివరకు కూల్చివేతలు చేపట్టబోమని ప్రభుత్వ న్యాయవాది అండర్‌టేకింగ్ ఇచ్చారు. దాన్ని మేం రికార్డు చేస్తున్నాం. అలాగే మెరిట్స్‌పై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదు’ అని పేర్కొంటూ విచారణను ముగించింది.