Share News

Hyderabad: చెరువుల పరిరక్షణపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:13 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని 3,532 చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటిలో ఆక్రమణల తొలగింపు, ఎన్ని చెరువులకు హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేశారనే అంశాలపై స్థాయీ నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Hyderabad: చెరువుల పరిరక్షణపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని 3,532 చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటిలో ఆక్రమణల తొలగింపు, ఎన్ని చెరువులకు హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేశారనే అంశాలపై స్థాయీ నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యేక సుమోటో రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల రిజిస్టర్‌ చేయగా.. బుధవారం మరోసారి చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. నోటిఫికేషన్‌ జారీచేసే ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వరకు 2,846 చెరువులకు ప్రాథమిక, 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ చేశామని, మిగిలిన వాటికి సైతం ఇస్తామని చెప్పారు.


ఈ పిటిషన్‌ను మూడు నెలల తర్వాతకు వాయిదా వేయాలని కోరారు. ‘అప్పుడు మీరు వచ్చి ఎలాంటి పురోగతి లేదని చెప్తే మేం ఏం చేయాలి? కాబట్టి డిసెంబరు 30న మరోసారి పురోగతిపై నివేదిక ఇవ్వాల’ని ధర్మాసనం ఆదేశించింది. ఫైనల్‌ నోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. ‘చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు పనిని ‘లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’ చేస్తుందా, హైడ్రా చేస్తుందా అనేది మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది పని పూర్తి కావడమ’ని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను డిసెంబరు 30కి వాయిదా వేసింది.

Updated Date - Nov 28 , 2024 | 04:13 AM