High Court: 25న మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ధర్నాకు అనుమతివ్వండి: హైకోర్టు
ABN , Publish Date - Nov 22 , 2024 | 02:39 AM
మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్/మహబూబాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తున్న లగచర్ల గ్రామస్థులను పోలీసులు కేసులతో వేధిస్తున్నారని నిరసిస్తూ.. మహబూబాబాద్‌లో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈనెల 25న ఉదయం 10 నుంచి 1 గంటల వరకు వెయ్యి మందితో ధర్నా నిర్వహించుకోవచ్చని.. పోలీసుల షరతులను పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ధర్నాను విజయవంతం చేయండి: మాలోతు కవిత
రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి ధర్నా కార్యక్రమానికి పోలీసు అనుమతి రాకుండా అడ్డుకుందని మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోతు కవిత ఆరోపించారు. గురువారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, ముందుగా గురువారం నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మహబూబాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి బీఆర్‌ఎస్ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రాత్రి 11గంటల నుంచి 24గంటల పాటు 144 సెక్షన్ విధించారు.