Share News

High Court: పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు?

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:09 AM

ఐటీ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు 2001-2006 మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములను తక్కువ ధరకు పొంది ఇప్పటివరకు

High Court: పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు?

  • ఇందూ టెక్‌జోన్‌, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌, స్టార్‌గేజ్‌,

  • అనంత టెక్నాలజీస్‌, జేటీ హోల్డింగ్స్‌ పనులు చేపట్టలేదు

  • వాటికి భూకేటాయింపులను రద్దు చేయండి

  • ఆ సంస్థలపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

  • నిబంధనలు పాటించేవాటిపై జోక్యం చేసుకోమన్న కోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఐటీ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు 2001-2006 మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములను తక్కువ ధరకు పొంది ఇప్పటివరకు ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయని కంపెనీల భూకేటాయింపులను రద్దు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ఎలాంటి పనులు చేపట్టని ఇందూ టెక్‌జోన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్టార్‌గేజ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అనంత టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, జేటీ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా ఇతర కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.


ఎలాంటి టెండర్లు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు, సంస్థలకు రాయితీపై విక్రయించడం, లీజుకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, షరతులకు విరుద్ధంగా చేసిన కేటాయింపులను, ఎలాంటి పనులు చేపట్టని కంపెనీలకు చేసిన కేటాయింపులను రద్దు చేయాలని, టెండర్లు లేకుండా భూకేటాయింపులకు అనుమతిస్తున్న ఏపీఐఐసీ అలాట్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌-1998ని కొట్టేయాలని కోరుతూ క్యాంపెయిన్‌ ఫర్‌ హౌసింగ్‌ అండ్‌ టెన్యురల్‌ రైట్స్‌(ఛత్రి), ఓఎం డెబెరా, ఎన్‌.రాంరెడ్డి తదితరులు హైకోర్టులో 2007లో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీఐఐసీని, విప్రో, ఇన్ఫోసిస్‌, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌, హనీవెల్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌ ల్యాబ్‌, న్యూలాండ్‌ ల్యాబ్‌, విసువల్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌, ఇండియన్‌ హోటల్స్‌, హిందూజా గ్రూప్‌ సహా పలు కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. సదరు పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.


ఎలాంటి టెండరింగ్‌ లేదా బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నామినేషన్‌ పద్ధతిలో తక్కువ ధరలకు విలువైన ప్రభుత్వ భూములను కేటాయించడం అక్రమమని పేర్కొన్నారు. 1998లో ఏపీఐఐసీ రెగ్యులేషన్స్‌ రూపొందించారని, వాటికి విరుద్ధంగా నామమాత్రపు ధరలకు భూకేటాయింపులు చేశారని తెలిపారు. భూకేటాయింపులు చేసిన సమయంలో కోకాపేట్‌ వంటి ప్రాంతాల్లో ఎకరానికి రూ.4.5 కోట్లు ధర ఉందని, అంతకంటే విలువైన భూములను ఇష్టానుసారం కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపించారు. ప్రతివాదుల్లో కొన్ని కంపెనీలు ఐటీ కంపెనీ నిర్వచనంలోకి రావని తెలిపారు. నామినేషన్‌ పద్ధతిలో ఎందుకు కేటాయిస్తున్నారో ఎలాంటి కారణాలు వివరించలేదని ప్రస్తావించారు. ఏపీఐఐసీ రెగ్యులేషన్స్‌ ప్రకారం నామినేషన్‌ పద్ధతిలో కేటాయిస్తే మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటి మార్గదర్శికాలేవీ లేకుండా చేసిన ఈ కేటాయింపులు చెల్లవని పేర్కొన్నారు. పేద ప్రజలు, రైతుల నుంచి భూసేకరణ చేసి, కంపెనీలకు ఇచ్చారని చెప్పారు. వాటిలో కొన్ని ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రస్తావించారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ఒక విధానం రూపొందించి కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. 1894 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించి కంపెనీలు ముందుకు రావడానికి నామినేషన్‌ పద్ధతిపై కేటాయింపులు చేసినట్లు తెలిపారు. 1996 నుంచి 2006 వరకు భూకేటాయింపులు జరిగితే 2007లో పిటిషన్‌ దాఖలు చేశారని, పిటిషన్‌ దాఖలు చేయడంలో ఆలస్యం, అశ్రద్ధ ఉన్నాయని చెప్పారు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ప్రశ్నించడం సబబు కాదని, ప్రజాహితం పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. భూమి ఉపయోగించుకోని, ఒప్పందాలను ఉల్లంఘించిన కంపెనీల కేటాయింపులు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక ఆర్థికాభివృద్ధిలో భాగంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇది కొనసాగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న విధాన నిర్ణయాలే తప్ప అందులో ఎలాంటి వివక్షకు తావు లేదని తెలిపారు. ఎప్పటి నుంచో విధాన నిర్ణయాల ద్వారా జరుగుతున్న అభివృద్ధిలో జోక్యం చేసుకోలేమని చెప్పారు.


వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ఆదాయం పెంచడం, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి కోసం విధాన నిర్ణయాల ద్వారా పరిశ్రమలకు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించాయని తెలిపింది. ప్రభుత్వ విధానంలో దురుద్దేశాలు, అక్రమాలు, అసాధారణం ఏదీ లేదని తెలిపింది. కాబట్టి పాలసీ నిర్ణయాల్లో జోక్యానికి అవకాశంలేదని పేర్కొంది. విప్రో, ఇన్ఫోసిస్‌, ల్యాంకో ఇన్‌ఫ్రా, హనీవెల్‌, న్యూల్యాండ్‌ ల్యాబ్‌, మెఘాసాఫ్ట్‌, మెట్రో కాష్‌ అండ్‌ క్యారీ, ఇండియన్‌ హోటల్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంకు వంటి అనేక కంపెనీలు రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయని, సదరు కంపెనీలు 3 నుంచి 6 వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ విజ్ఞప్తితో వచ్చిన కంపెనీలను ఇప్పుడు మార్కెట్‌ రేటు చెల్లించాలనడం సబబు కాదని తెలిపింది. భూములు తీసుకొని ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయని, నిర్మాణాలు చేపట్టని ఇందూ టెక్‌జోన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీల కేటాయింపులు నాలుగు నెలల్లో రద్దు చేయాలని పేర్కొంటూ తుది తీర్పు ఇచ్చింది. ఇందూ టెక్‌ జోన్‌ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితుల జాబితాలో ఉంది.

Updated Date - Oct 08 , 2024 | 03:09 AM