High Court: పోషకాహారం అందుతోందా?
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:18 AM
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నారా? లేదా? అనే అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హాస్టళ్లు, గురుకులాల్లో సౌకర్యాలపై నివేదిక కోరిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నారా? లేదా? అనే అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)- 2018 మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందడం లేదని, పిల్లల నిష్పత్తికి తగిన విధంగా మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం పరుపు, కాటన్ బెడ్‌షీట్, కవర్‌తో కూడిన దిండు, కాటన్ దుప్పట్లు, దోమతెర, శుద్ధమైన తాగునీరు (ఆర్వో వాటర్) వంటి సదుపాయాలు ఉన్నాయా? మార్గదర్శకాల ప్రకారం మెనూ అందజేస్తున్నారా? అని అడిగింది. అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.