Share News

High Court: ‘పటేల్‌గూడ’ భూములను సర్వే చేయండి

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:18 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడలోని సర్వే నంబరు 6, 12లో ఉన్న భూములను సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.

High Court: ‘పటేల్‌గూడ’ భూములను సర్వే చేయండి

  • ప్రభుత్వానివో, ప్రైవేటువో తేల్చండి

  • సంగారెడ్డి జిల్లా సర్వే అధికారులకు హైకోర్టు ఆదేశం

  • హైడ్రా కూల్చివేతల కేసులో స్టేటస్‌ కో విధించిన కోర్టు

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడలోని సర్వే నంబరు 6, 12లో ఉన్న భూములను సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ సర్వే నంబర్లలోని భూములు ప్రైవేటువా, ప్రభుత్వానివా అన్నది గుర్తించాలని జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పటేల్‌గూడ సర్వే నంబరు 6లో ఉన్నవి ప్రైవేటు భూములని.. రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా ప్లాట్లు కొనుక్కొని, అన్ని అనుమతులతో ఇళ్లు కట్టుకుంటే హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని పేర్కొంటూ హైకోర్టులో 22పిటిషన్లు దాఖలయ్యాయి.


ఈ పిటిషన్లపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తూ.. ఆ భూములు సర్వే నంబరు 6లో లేవని, 12లో ఉన్న ప్రభుత్వ భూములని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సర్వే నంబరు 6, 12 భూములను సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ భూములు సర్వే నంబరు 6లో ఉన్నట్లు తేలితే అనుమతించిన పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. అలాగే పిటిషనర్లు నష్టపరిహారం కోరవచ్చంది. ఒకవేళ ఆ భూములు సర్వే నంబరు 12లో ఉన్నట్లు తేలితే.. పిటిషనర్లు తమ సేల్‌ డీడ్‌లు సమర్పించి రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు స్టేటస్‌ కో పాటించాలని తుది తీర్పు జారీ చేసింది.

Updated Date - Nov 21 , 2024 | 05:18 AM