Gorrepati Madhavarao: గొర్రెపాటికి తుది వీడ్కోలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:25 AM
మానవ హక్కుల ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు అంతిమయాత్ర ఆదివారం జరిగింది. నిజామాబాద్‌లోని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం ఎన్‌ఆర్ భవన్ నుంచి ప్రధాన వీధుల గుండా వైద్య కళాశాల వరకు కొనసాగింది.
అంతిమయాత్ర.. అనంతరం మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించిన కుటుంబం
మండవ, వివిధ సంఘాల నేతల నివాళి
సుభాష్ నగర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు అంతిమయాత్ర ఆదివారం జరిగింది. నిజామాబాద్‌లోని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం ఎన్‌ఆర్ భవన్ నుంచి ప్రధాన వీధుల గుండా వైద్య కళాశాల వరకు కొనసాగింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని విద్యార్థుల పరిశోధనార్థం వైద్య కళాశాలకు అప్పగించారు. అంతిమయాత్రలో సీపీఐఎంఎల్, మానవ హక్కుల వేదిక, వామపక్షాల నాయకులు పాల్గొని గొర్రెపాటికి తుది వీడ్కోలు పలికారు. తొలుత ఎన్‌ఆర్ భవన్‌లో సంతాప సభ నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ అణచివేతకు గురైన వారి గొంతుకగా గొర్రెపాటి నిలిచారన్నారు.
ఆయన భౌతికకాయాన్ని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మానవ హక్కుల కోసం గొర్రెపాటి నాలుగు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారన్నారు. సీపీఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వెంకటరామయ్య, రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, మానవ హక్కుల వేదిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, తిరుపతయ్య, వీ ప్రభాకర్, రామకృష్ణ, వీ కృష్ణ, దేవరాం తదితరులు పాల్గొన్నారు.