Hyd : మూసీని.. మూసేసి..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 05:46 AM
అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..!
వ్యర్థాలతో నింపి ప్లాట్లుగా విక్రయం.. పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు
ఇప్పటికీ కొనసాగుతున్న ఆక్రమణలు
టిప్పుఖాన్ బ్రిడ్జ్ వద్ద యథేచ్ఛగా లేఅవుట్లు
బాపూఘాట్ వరకు పూర్తిగా కబ్జా
జియాగూడలో కలుస్తున్న కబేళా వ్యర్థాలు
పురానాపూల్‌లో శ్మశానం, దర్గా విస్తరణ
చాదర్‌ఘాట్ కాజ్ వే ద్వారాలకూ కబ్జా చెర
అంబర్‌పేటలో మట్టితో నింపేస్తున్న వైనం
నాగోల్‌లో బఫర్‌జోన్‌లోనే లేఅవుట్లు
(ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సిటీ నెట్‌వర్క్)
అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..! రేవంత్ సర్కారు లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయమైనా.. రూ. లక్షన్నర కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ మహా క్రతువుకు అడుగడుగునా అడ్డంకులుగా కబ్జాలు, పూడికలు, డంపింగ్ యార్డులు ఉన్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వం కూడా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటపొలాలకు నీరందించిన మూసీ.. ఇప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయింది. కొన్ని చోట్ల ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ బృందం నార్సింగ్ ఔటర్ నుంచి.. నాగోల్‌లోని మూసీ బ్రిడ్జి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసీని మూసేసిన వైనంపై.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..!
గండిపేట వరకే స్వచ్ఛత..!
అనంతగిరి కొండల నుంచి గండిపేట సమీపం వరకు మాత్రమే మూసీ నది నీరు స్వచ్ఛంగా ఉంటోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. గండిపేట నుంచి టిప్పుఖాన్ బ్రిడ్జి వరకు నాలుగు కిలోమీటర్ల మేర మూసీ నది ఉండగా.. రెండు కిలోమీటర్ల మేర ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ మీదుగా ప్రవహిస్తోంది. మిగతా రెండు కిలోమీటర్లలో.. నార్సింగ్, గండిపేట, మంచిరేవుల, పీరంచెరువు గ్రామ పంచాయతీల పరిధుల్లో.. బఫర్ జోన్లు ఆక్రమణలకు గురయ్యాయి.
యథేచ్ఛగా నిర్మాణాలు వెలుస్తున్నా.. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న ఐటీ కారిడార్ బహుళ అంతస్తుల డ్రైనేజీ మొత్తం మూసీలోనే కలుస్తోంది. అంటే.. కోకాపేట, నార్సింగ్, పుప్పాల్‌గూడ, మణికొండ, రాయదుర్గంతోపాటు.. మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల మురుగుకు మూసీ అడ్డా అవుతోందన్నమాట.
టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి లేఅవుట్లు
టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ వంతెన వరకు మూసీని రెండు వైపులా మట్టితో నింపేసిన భూబకాసురులు.. యథేచ్ఛగా కబ్జాచేసి, లేఅవుట్లు వేశారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లంగర్‌హౌస్ బాపూనగర్ బస్తీ వెనక కబ్జా పరిస్థితి తారాస్థాయిలో ఉంది. బాపూఘాట్, డిఫెన్స్ కాలనీ వెనక వైపున్న మూసీ బఫర్ జోన్‌లో ఏకంగా రాజకీయ నాయకులే లేఅవుట్లు వేశారు. అంతేకాదు.. టోలిచౌకి, హకీంపేట్ ప్రాంతాల్లోని దాదాపు 100 కాలనీల మురుగునీరు బాపూఘాట్ వద్ద మూసీలో కలుస్తోంది. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ వరకు మూసీ తీరమంతా చెత్త డంపింగ్ యార్డుగా మారిపోయింది.
కార్వాన్‌లో మండపాల నిర్మాణం
కార్వాన్ గిర్కపల్లి, రాంసింగ్‌పుర, మొఘల్-కా-నాలా, అంద్రూనీ/బైరూనీ కార్వాన్ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. రాంసింగ్‌పుర ప్రాంతంలో పరీవాహక ప్రాంతంలో మండపాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో మూసీ నది వెడల్పు పూర్తిగా తగ్గిపోయి.. చిన్న కాలువలా కనిపించడం గమనార్హం..! పక్కనే ఉన్న జియాగూడలో సుమారు 15 గోదాములు మూసీ బఫర్‌జోన్‌లో కొనసాగుతున్నాయి.
పహిల్వాన్లు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ గోదాములకు నెలవారీ అద్దెను వసూలు చేస్తున్నారు. నెలరోజుల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి.. రెండ్రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా.. ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..! మొఘల్-కా-నాలా, కేసరి హనుమాన్, గిర్కపల్లి ప్రాంతాల్లో మూసీ బఫర్ జోన్‌లో దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇక జియాగూడలోని కబేలాలో మేకలు, గొర్రెల వ్యర్థాలను పైప్‌లైన్ల ద్వారా మూసీలోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలు దుర్గంధంగా తయారవుతున్నాయి. గౌలిగూడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సమీపంలోని మూసీ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి అనధికారికంగా నర్సరీని కొనసాగిస్తున్నాడు.
విస్తరిస్తున్న శ్మశానవాటిక, దర్గా
పురానపూల్ వద్ద హిందూ శ్మశానవాటిక, ఒక దర్గా ఉంది. ఈ రెండూ మూసీ నదిలోనే కొనసాగుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండూ విస్తరిస్తూ.. మూసీని కుంచించుకుపోయేలా చేస్తున్నాయి. దూద్‌బౌలిలోని రమ్నా్‌సపురలో ఉన్న పశువధశాల నుంచి కూడా మూసీలోకి వ్యర్థాలను వదులుతున్నారు. చాదర్‌ఘాట్ కాజ్‌వే బ్రిడ్జి కింద 18 ద్వారాలుండగా.. అటూఇటూ కలిపి.. 10 ద్వారాలు మూసుకుపోయేలా మట్టితో పూడ్చేశారు. దీంతో కేవలం 8 ద్వారాలే కనిపిస్తున్నాయి. చాదర్‌ఘాట్ పరిసరాల్లో మూసీ చాలా వరకు కబ్జాకు గురైంది. అంబర్‌పేట్ వరకు కబ్జాదారులు మూసీలో అరటి, కొబ్బరిచెట్లను పెంచుతూ.. వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు.
షాక్ కొడుతున్న మూసీనది
వాహెద్‌నగర్‌లో మూసీని మట్టితో పూడ్చడంతో పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగలతో ‘ఎర్త్’ వస్తుంది. దీంతో.. ఇక్కడ ఆడుకోడానికి వచ్చిన చిన్నారులు పలుమార్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ముసారాంబాగ్ బ్రిడ్జి కింద మట్టి, కోళ్ల వ్యర్థాలతో మూసీని కప్పేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మూసీని ఆక్రమించి దుకాణాలను నిర్మిస్తున్నారు. ఇక కొత్తపేట డివిజన్‌లోని జనప్రియ అవెన్యూ, సత్యానగర్ కాలనీల వద్ద పచ్చటి తడ్డి పొలాలు ఉన్నాయి. మూసీలో ఎగువ ప్రాంతాల మురుగు మూసీలోకి ప్రవహిస్తోంది. పరిసర కాలనీల మురుగను పైప్‌లైన్ల ద్వారా మూసీలో కలుపుతున్నారు.
రామంతాపూర్ భగాయత్‌లో..
రామంతాపూర్, ఉప్పల్ భగాయత్ గడ్డి భూములలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేరిట బస్తీలు వెలిశాయి. ఇవన్నీ మూసీ బఫర్‌జోన్‌లో ఏర్పాటైనవే కావడం గమనార్హం..! సందేట్లో సడేమియా అన్నట్లు కొందరు నేతలు ఇక్కడ లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి ఠంచన్‌గా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ.. ఇతర విభాగాల అనుమతులు లభిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు, విజిలెన్స్ విభాగం వీటి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగోల్ ప్రాంతంలోనూ మూసీని కబ్జా చేస్తూ లేఅవుట్లు, వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులకు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ బఫర్‌జోన్‌లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు కొనసాగుతున్నాయి.
అంబర్‌పేటలో మట్టితో కప్పేస్తున్నారు
అంబర్‌పేట డివిజన్‌లో దుర్గానగర్, న్యూదుర్గానగర్, అహ్మద్‌నగర్, నరేంద్రనగర్, తదితర ప్రాంతాలు మూసీని ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మూసీనది క్రమంగా కబ్జాలతో కుంచించుకుపోతోంది. కొందరు ప్లాట్లు చేసి, విక్రయించగా.. ఇంకొందరు గడ్డిని పెంచుతున్నారు. దీంతో దోమల వృద్ధికి ఈ ప్రాంతాలు దోహదపడుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు.. వ్యర్థాలను యథేచ్ఛగా మూసీలో వేస్తున్నారు.