Hyderabad: ఆర్టీఏల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
ABN , Publish Date - May 29 , 2024 | 10:46 AM
మహానగరంలోని నాలుగు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు(ACB officials) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీడీలు ఉండాల్సిన ఫైళ్లలో నగదు, ఏజెంట్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ర్టేషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన దరఖాస్తులున్నట్టు గుర్తించారు.
- నాలుగు ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల దాడులు
- డీడీల స్థానంలో నగదు, ఏజెంట్ల వద్ద దరఖాస్తులు లభ్యం
- అధికారుల అదుపులో 27 మంది..
- రూ.1.37 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: మహానగరంలోని నాలుగు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు(ACB officials) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీడీలు ఉండాల్సిన ఫైళ్లలో నగదు, ఏజెంట్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ర్టేషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన దరఖాస్తులున్నట్టు గుర్తించారు. కొందరు ఉద్యోగులు యూనిఫామ్‌లు ధరించకుండా అక్రమ మార్గంలో పనులు చక్కబెడుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. మలక్‌పేట, టోలిచౌకి, బండ్లగూడ(Malakpet, Tolichowki, Bandlaguda), మణికొండలోని రంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయాల్లో మంగళవారం దాడులు జరిగాయి. తనిఖీల సమయంలో సేవలను నిలిపివేసిన అధికారులు.. ఆర్టీఏ ఉద్యోగులతో మాట్లాడారు. రికార్డులు తనిఖీ చేయడంతో పాటు టేబుళ్లపై ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. నాలుగు కార్యాలయాల్లో 27మంది ఇతరులు (ఏజెంట్లు)ఉన్నట్లు, రూ.1.37 లక్షల నగదును గుర్తించారు. మలక్‌పేట ఆఫీస్‌లో 15మంది ఏజెంట్లు, కార్యాలయంలోని సజ్జపై పర్సులో రూ.22 వేలు గుర్తించామని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆ పర్సు ఎవరిదనేది తేలినా.. అధికారికంగా ప్రకటించలేదు. బండ్లగూడలో రూ.48,370 స్వాధీనం చేసుకున్నారు. టోలిచౌకి ఆఫీస్‌లో ఏడుగురు ఏజెంట్లను గుర్తించడంతోపాటు రూ.43,360 స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని రంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో రూ.23,710 స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్యాలయంలో అధికారు లు, ఉద్యోగులు, ఏజెంట్ల పాత్రపై సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే...
ఆశ్చర్యపోయిన ఏసీబీ అధికారులు..
ఆర్టీఏ కార్యాలయాల్లో బాహాటంగా జరుగుతోన్న అవినీతిని చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. పనికో రేటును నిర్ణయించి అధికారులు, దళారులు పంచుకోవడాన్ని ఆధారాలతో సహా గుర్తించారు. ఏ దరఖాస్తు ఏ అధికారి పరిశీలిస్తారు..? ఏ ఫైల్‌కు ఎంత డబ్బులు ఇస్తారనేది దళారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, దళారుల మధ్య ఒప్పందాలపై వివరాలు సేకరించారు. ఇతర వ్యక్తులు కార్యాలయాల్లో ఎందుకున్నారని అడిగితే మలక్‌పేటలోని ఆర్టీఏ ఉద్యోగులు నీళ్లు నమిలినట్టు తెలిసింది. తనిఖీల నేపథ్యంలో రూపొందించిన నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై తదుపరి చర్యలుంటాయని ఏసీబీ అధికారొకరు తెలిపారు.పారదర్శకంగా అందాల్సిన పౌర సేవలు ఆర్టీఏ కార్యాలయంలో బ్లాక్‌లో అందుతున్నాయని గుర్తించారు. అవినీతిపై అధిక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మొదటి విడతగా నాలుగు ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించామని, ఇకముందు కూడా కొనసాగుతాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu Newshy