Hyderabad: మియాపూర్‌లో రణరంగం.. పోలీసులపై రాళ్లతో మహిళల దాడి..
ABN , Publish Date - Jun 23 , 2024 | 08:59 AM
మియాపూర్(Miyapur) శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓ దశలో మహిళలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పారిపోయి తలదాచుకున్నారు.
- పరుగులు తీసిన ఖాకీలు
- ప్రభుత్వ భూముల్లో పాగాకు పేదల యత్నం
- కబ్జాలు చేస్తే పీడీయాక్ట్ : అధికారులు
హైదరాబాద్: మియాపూర్(Miyapur) శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓ దశలో మహిళలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పారిపోయి తలదాచుకున్నారు. ఈ సంఘటనలో హుడా సైట్ ఆఫీసర్ రఘుకు ఛాతి మీద రాయి తగిలి స్వల్ప గాయమైంది. ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సీఎం లేదా కలెక్టర్ వస్తేనేగానీ కదిలేది లేదని భీష్మించారు. ఆ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మించిన ఆలయం వద్ద దాదాపు రెండు వేల మందికి పైగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు మహిళలెవరూ అక్కడి నుంచి కదలలేదు. పోలీసులు భారీగా చేరుకొని గస్తీ కాస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రాగి + ఇనుము = బంగారం...
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ ప్రశాంత్‌నగర్, దీప్తిశ్రీనగర్, హెచ్‌ఎంటీ స్వర్ణపురి, మక్తా సరిహద్దులో సర్వేనెంబర్ 100, 101 పరిధిలో 550ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలరోజుల క్రితం ఈ భూమిలో కొందరు మహిళలు పాగా వేయడానికి ప్రయత్నించారు. క్రమంగా వందమంది స్థల కబ్జాకు ప్రయత్నించగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
‘గుడిసె వేసుకుంటే ఇంటి జాగా’ అంటూ ప్రచారం
మియాపూర్‌లోని భూమిలో పాగా వేసేందుకు స్థానికంగా కొందరు దళారులు మహిళలను ఉసిగొల్పడంతో పాటు సోషల్ మీడియాలో ‘గుడిసె వేసుకుంటే హైదరాబాద్(Hyderabad)లో ఇంటి జాగా’ అంటూ ప్రచారానికి దిగారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర రూ.లక్ష పలుకుతుండడంతో ఒక్కో ఇంటి స్థలానికి కోటి రూపాయలు వస్తుందని ప్రచారం జరిగింది. ఇంత పెద్దమొత్తంలో వచ్చే భూమిని ఎందుకు వదిలేయాలని పేదలు భారీగానే తరలివచ్చారు. దాంతో యాబై.. వంద మందితో ప్రారంభమై ప్రస్తుతం రెండు వేలకు పైగా మహిళలు స్థల కబ్జాకు యత్నిస్తున్నారు. బంధువుల సమాచారంతో కొందరు పలు జిల్లాల నుంచి కూడా వచ్చారు. భారీగా తరలివచ్చిన మహిళలు రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఓ గ్రూపు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయగా, మరో గ్రూపు ఆ భూముల్లో రాత్రికిరాత్రే గుడి నిర్మించి అక్కడే ఉండిపోయారు. శనివారం పెద్దఎత్తున వేలాదిగా తరలివచ్చిన పేదలతో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చర్చించింది. వివాదంలో ఉన్న భూముల్లోకి రాకూడదని సర్దిచెప్పారు. అయినా పేదలు వినిపించుకోలేదు. తమ వెంట తెచ్చుకున్న కర్రలు, ప్లాస్టిక్ కవర్లు, చీరలతో డేరాలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తలోదిక్కున పరుగులు తీశారు. ఏవైపు నుంచి రాళ్లు వస్తున్నాయో తెలీక పోలీసులు పారిపోయి తలదాచుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
విఫలమైన అధికార యంత్రాంగం
మియాపూర్‌లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించిన పేదలు, మహిళలకు ఏ పార్టీ అండ లేదు. ఏ నేత కూడా ధైర్యమివ్వలేదు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలను, పేదలను అదుపు చేయడంలో అధికారయంత్రాంగం పూర్తిగావిఫలమైంది. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు అక్కడి వచ్చిన మహిళలకు అవగాహన కల్పించలేకపోయారు. ఈ భూమిలోకి ప్రవేశిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించలేదు. పోలీసులు కూడా అక్కడి పరిస్థితులను అంచనా వేయలేదు. అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన కనీస చర్యలు చేపట్టలేదు. దాంతో మహిళలు ప్రతిఘటిస్తే పోలీసులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భూములకు చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రైవేటు భూమి యజమానులు ఎవరూ తమ భూమిలోకి రాకుండా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాళ్ల దాడి నేపథ్యంలో ఉన్నతాధికారులు పెద్దమొత్తంలో పోలీసులను అక్కడ మోహరించారు.
కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు : అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడతామన్నారు.
ఇతర జిల్లాల నుంచి భారీగా రాక..
ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసేందుకు మొదట్లో మియాపూర్‌కు అనుకుని ఉన్న రెండుమూడు బస్తీల వాసులు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రచారంతో సంగారెడ్డి, జహీరాబాద్, కొల్లాపూర్‌కు చెందిన వారితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ఇక్కడి హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు జనంతో కళకళలాడిపోతున్నాయి. దీనికి తోడు మియాపూర్, ప్రశాంత్‌నగర్, దీప్తిశ్రీనగర్‌లో రోడ్లపై పార్కు చేసిన వాహనాలతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News