Share News

Biryani: వహ్వా.. హైదరాబాద్‌ బిర్యానీ!

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:36 AM

బిర్యానీ... హైదరాబాద్‌ సంస్కృతిలో ఒక భాగం. దాని రుచికి ప్రపంచమే ఫిదా అయిపోయిందని వెల్లడించింది సుప్రసిద్ధ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌.

Biryani: వహ్వా.. హైదరాబాద్‌ బిర్యానీ!

  • అత్యుత్తమ వంటకాల్లో 31వ ర్యాంకు

  • అవార్డులను ప్రకటించిన ‘టేస్ట్‌ అట్లాస్‌’

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బిర్యానీ... హైదరాబాద్‌ సంస్కృతిలో ఒక భాగం. దాని రుచికి ప్రపంచమే ఫిదా అయిపోయిందని వెల్లడించింది సుప్రసిద్ధ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌. 2024-25 సంవత్సరానికి అందించిన వరల్డ్‌ ఫుడ్‌ అవార్డుల్లో ఇండియన్‌ క్విజిన్‌ అంతర్జాతీయంగా 12వ స్ధానంలో నిలిస్తే, వంటకాల్లో హైదరాబాద్‌ బిర్యానీ 31వ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడ్డ 15,478 వంటకాల్లో హైదరాబాద్‌ బిర్యానీ స్ధానమిది. ప్రపంచ వ్యాప్తంగా 4,77,287కు పైగా ఫుడ్‌ బ్లాగర్స్‌తో పాటు ఆహారాభిమానులు ఓటు వేసి ఈ వంటకాలను ఎంపిక చేశారని ఆ సంస్థ పేర్కొంది. వరల్డ్‌ ఫుడ్‌ అవార్డుల్లో భాగంగా అత్యుత్తమైన 100 ఆహారాలు, క్విజిన్స్‌, వంటకాలు, ప్రాంతాలు, నగరాలు, రెస్టారెంట్లను ఎంపిక చేసింది.


అత్యుత్తమ నగరాల జాబితాలో ముంబై 5వ స్ధానంలో నిలవగా, హైదరాబాద్‌కు 50వ స్ధానం దక్కింది. అమృత్‌సర్‌ (43), న్యూఢిల్లీ (45), కోల్‌కతా (71), చెన్నై (75) కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్‌ కు వెళ్లిన వారు తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాల్లో పంజాబీ వంటకం అమృత్‌సరి కుల్చా తొలి స్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో బటర్‌ గార్లిక్‌ నాన్‌, ముర్గ్‌ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ నిలిచాయి. హైదరాబాద్‌ బిర్యానీ తినాలంటే మాత్రం షాదాబ్‌ రెస్టారెంట్‌కు వెళ్తామని ఎక్కువ మంది ఓట్లేశారు. ప్రాంతాల వారీ కేటగిరీలో దక్షిణ భారత వంటకాలు 59వ స్థానంలో నిలిచాయి. దక్షిణ భారత వంటకాల్లో రేటింగ్స్‌ పరంగా హైదరాబాద్‌ బిర్యానీ అగ్రస్థానం దక్కింది. ఆ తరువాతి స్థానాల్లో చికెన్‌ 65, మసాలా దోశ నిలిచాయి. దక్షిణ భారత సంప్రదాయ వంటకాలను రుచి చూపించే రెస్టారెంట్లలో ఐటీసీ కోహినూర్‌ మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తుమ 100 రెస్టారెంట్ల జాబితాలో బెంగళూరు, కోజికోడ్‌, కోల్‌కతా వంటి నగరాలకు చెందిన రెస్టారెంట్లకు స్ధానం లభిస్తే, హైదరాబాదీ రెస్టారెంట్‌ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.

Updated Date - Dec 13 , 2024 | 04:36 AM