Hyderabad: చెత్తతో సీఎన్‌జీ..! జవహర్‌నగర్‌లో ప్లాంట్ నిర్మాణం
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:58 PM
చెత్తతో సీఎన్ జీని ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని జవహర్‌నగర్‌లో ప్లాంట్ నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. ప్లాంట్ మరో ఆరునెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
- ఆరు నెలల్లో అందుబాటులోకి..
- నిత్యం 500 మెట్రిక్ టన్నుల తడిచెత్త వినియోగం
- ప్యారానగర్, దుండిగల్‌లోనూ ఏర్పాటుకు ప్రతిపాదన
- ఇప్పటికే రెండు విద్యుదుత్పత్తి ప్లాంట్లు ప్రారంభం
- నిర్మాణంలో మరో ప్లాంట్
- ఇండోర్‌లో ఇప్పటికే అందుబాటులోకి..
మహానగరంలో వెలువడుతున్న తడిచెత్తతో సీఎన్‌జీని ఉత్పత్తి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జవహర్‌నగర్‌లో ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే మరో ఆరునెలల్లో సీఎన్‌జీ ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువులు, పొడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: మహానగరంలో బయో- సీఎన్‌జీ ప్లాంట్(Bio-CNG Plant) నిర్మాణం జరుగుతోంది. వ్యర్థాల పునర్వినియోగం లక్ష్యంగా జవహర్‌నగర్‌లో ప్లాంట్ నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. నిత్యం 500 మెట్రిక్‌టన్నుల తడిచెత్తను వినియోగించి గ్యాస్ తయారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: టెన్షన్.. టెన్షన్..! ఆపరేషన్ మూసీతో గ్రేటర్ వ్యాప్తంగా ఆందోళన
నిర్మాణంలో ఉన్న ప్లాంట్ మరో ఆరునెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో రోజూ 8వేల టన్నుల చెత్త వెలువడుతోంది. ఇందులో 4500 - 5000 టన్నుల తడిచెత్త ఉంటోంది. శాస్ర్తీయ నిర్వహణలో భాగంగా తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువులు, సీఎన్‌జీ గ్యాస్, పొడిచెత్త ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. రోజూ 300- 350 టన్నుల తడిచెత్తతో ప్రస్తుతం జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతోంది. జవహర్‌నగర్, దుండిగల్(Jawaharnagar, Dundigal)లోని ప్లాంట్‌లలో వ్యర్థాల నుంచి దాదాపు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
ఇందుకోసం సుమారు 2,250వేల మెట్రిక్ టన్నుల పొడిచెత్తను వినియోగిస్తున్నారు. డంపింగ్ యార్డులో క్యాపింగ్ చేసిన వ్యర్థాల నుంచి వెలువడుతోన్న మిథేన్ గ్యాస్‌తో ప్రస్తుతం బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. 100 శాతం వ్యర్థాల పునర్వినియోగం కోసం జవహర్‌నగర్‌లో మరో విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మిస్తోన్న జీహెచ్‌ఎంసీ(GHMC).. డంపింగ్ యార్డు ఏర్పాటుకు పరిశీలనలో ఉన్న ప్యారానగర్, దుండిగల్‌లో బయో సీఎన్‌జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
దీంతో వ్యర్థాలు నిల్వ ఉండకుండా చూడడంతోపాటు.. పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన, పర్యావరణ కాలుష్యం వంటి ఇబ్బందులు ఉండవని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇండోర్ పర్యటనకు వెళ్లిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ల బృందం అక్కడి బయో- సీఎన్‌జీ ప్లాంట్‌ను సందర్శించి నిర్వహణ పద్ధతులను పరిశీలించింది.
ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి
ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి
ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం
ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్..
Read Latest Telangana News and National News