Share News

AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:56 AM

‘‘చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుంది. కొన్ని చోట్ల మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది’’ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

  • ఆక్రమణల తొలగింపులో అది తప్పదు

  • చెరువుల్లో నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తాం

  • ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు కమిటీ: రంగనాథ్‌

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణలో ఇబ్బందులపై విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులతో భేటీ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుంది. కొన్ని చోట్ల మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది’’ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. అనుమతులు లేకుండా చెరువుల్లో చేపట్టే నిర్మాణాలు పెద్దలవైనా, పేదలవైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌తో సంబంధం లేకుండా సర్వే నంబర్లు మార్చి, నిర్మించిన భవనాలనే ఇప్పటి వరకు కూల్చేశామని చెప్పారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు నిపుణుల కమిటీ వేస్తామని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ఏ ప్రతిపాదికన నిర్ధారించాలి? అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏంటి? అనే అంశంపై శుక్రవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో మేధోమథనం జరిగింది. రంగనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ విశ్రాంత ఇంజనీర్లు, సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ అధికారులు, పర్యావరణవేత్తలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చెరువుల్లో ఉన్న నివాసాలను తొలగించబోమని, మున్ముందు ఆక్రమణలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువుల నీటి నిల్వ విస్తీర్ణం, సర్వే ఆఫ్‌ ఇండియా, ఇరిగేషన్‌, గ్రామ పటాలను పరిశీలించి హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ఇందుకోసం అధునాతన సాంకేతికతనూ వినియోగిస్తామన్నారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులపై కోర్టు స్టేటస్‌ కో ఇచ్చిందని, త్వరలో దాన్ని ఎత్తివేయించి సుందరీకరణ పనులు చేపడుతామని చెప్పారు.


చెరువుల వివరాల్లో గందరగోళం..

  • అమీన్‌పూర్‌ చెరువు విస్తీర్ణం 1949 కెడస్ట్రియల్‌ మ్యాప్‌ ప్రకారం - 96.8 ఎకరాలు కాగా, చెరువు చరిత్ర (మెమొయిర్స్‌) ప్రకారం - 93.37 ఎకరాలు.. సర్వే ఆఫ్‌ ఇండియా టోపోషీట్‌(2005) ఆధారంగా - 132.97 ఎకరాలు.. 2001లో చెరువులో నిలిచిన నీటి విస్తీర్ణం - 103 ఎకరాలు.. హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్‌, రెవెన్యూ విభాగాల సర్వే ప్రకారం - 464 ఎకరాలు

  • అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం దుర్గం చెరువు విస్తీర్ణం - 64 ఎకరాలు.. ప్రభుత్వ విభాగాలు నిర్వహించిన సర్వే ప్రకారం - 160 ఎకరాలు.

ఈ రెండు మేజర్‌ చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌), విస్తీర్ణం, బఫర్‌ జోన్‌కు సంబంధించిన వివరాలు ఒక్కో విభాగం రికార్డుల్లో ఒక్కోలా ఉన్నాయి. ఇది చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమీన్‌పూర్‌ చెరువు విస్తీర్ణం 464 ఎకరాలుగా హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్‌ విభాగాలు నిర్ణయించగా.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. చరిత్రలోని వివరాలకు భిన్నంగా ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణను కోర్టు తప్పుబట్టింది. ప్రస్తుతం చెరువులో 400 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో నీళ్లు ఉన్నాయి. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణలోనూ గందరగోళం నెలకొంది. గతంలో హుడానే ఇక్కడ లే అవుట్లకు అనుమతి ఇచ్చింది. కాలనీలూ వెలిశాయి. ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ కొన్నాళ్ల క్రితం ఇళ్లకు రెవెన్యూ విభాగం నోటీసులిచ్చింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణకు సంబంధించి ఇప్పటికీ సమగ్ర విధానాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి. లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (ఎల్‌పీసీ) నిర్ణయం మేరకు మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ 2013లో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ జరుగుతోంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించాల్సి వస్తోంది. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదరువుతున్నాయి. మున్ముందు అలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ ఎలా చేయాలన్న దానిపై సమావేశంలో చర్చించారు.

Updated Date - Nov 23 , 2024 | 04:56 AM