Share News

Hyderabad: ప్లాట్లలోకి చెరువులొచ్చాయ్‌..!

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:44 AM

‘‘అయ్యా.. మా ప్లాట్లలోకి చెరువులొస్తున్నాయి..’’ అంటూ హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు భిన్నమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Hyderabad: ప్లాట్లలోకి చెరువులొచ్చాయ్‌..!

హైడ్రాకు భిన్నమైన ఫిర్యాదులు.. ఇటీవల ఈ తరహా ఫిర్యాదుల ట్రెండ్‌.. అలుగులు, తూములు మాయం!!

  • చెరువుల్లో పెరిగిన నీటి నిల్వ విస్తీర్ణం

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లపై అయోమయం

  • హైడ్రాను ఆశ్రయిస్తున్న యజమానులు

  • రికార్డులు, ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న హైడ్రా

  • సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం: రంగనాథ్‌

  • ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘అయ్యా.. మా ప్లాట్లలోకి చెరువులొస్తున్నాయి..’’ అంటూ హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు భిన్నమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వరకు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు రాగా.. ఇప్పుడు చెరువులే తమ ప్లాట్లను ఆక్రమిస్తున్నాయంటూ బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. చెరువుల విస్తీర్ణం పెరిగి.. ఎన్నడూ లేని విధంగా తమ ప్లాట్లను ముంచెత్తుతున్నాయని యజమానులు తమ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ప్లాట్లలోకి నీళ్లు వస్తుండడంతో.. తాము బఫర్‌జోన్‌ లేదా ఎఫ్‌టీఎల్‌లో ఉన్నామని హైడ్రా భావించే ప్రమాదమున్నట్లు ప్లాట్ల యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కొన్నాళ్ల క్రితం అమీన్‌పూర్‌ చెరువుకు సంబంధించి ఇదే తరహా ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.


అలుగులు, తూములను మూసేయడంతో..

హైడ్రా పరిధిలో(గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు) 540 చెరువులున్నాయి. వీటిల్లో 185 జీహెచ్‌ఎంసీ పరిధిలో.. మిగతా 355 గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆవల ఉన్నాయి. ఈ చెరువుల్లో చాలా వరకు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రా ఇప్పటికే గుర్తించింది. 1973 నుంచి అందుబాటులో ఉన్న సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, విలేజ్‌ మ్యాపుల ఆధారంగా ఆక్రమణలపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అభివృద్ధి.. విస్తరణ క్రమంలో చాలా చెరువుల అలుగులు, తూములను మూసివేశారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు వరద నీరు వెళ్లేందుకు అనుసంధానంగా ఉన్న కాల్వలు/నాలాలు కూడా కనుమరుగయ్యాయి. కొన్నిచోట్ల వాటిని మట్టితో పూడ్చిపెట్టగా.. మరికొన్ని చోట్ల దారి మళ్లించారు. చెరువుల్లో నిర్ణీత స్థాయిలో వర్షపు నీరు చేరాక.. అదనపు నీరు దిగువకు వెళ్లేలా అలుగులు దోహదపడతాయి. సాగునీటి అవసరాలకు తూములను ఉపయోగిస్తారు. కొన్నేళ్లుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో.. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అలుగులు, తూములను మూసివేయడంతో.. చెరువుల విస్తీర్ణం పెరిగి.. ఆవాస ప్రాంతాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లపై అస్పష్టత నెలకొంటోంది. దీంతో.. చెరువుల సమీపంలోని పట్టా భూముల్లో పాల్ట్లను కొనుగోలు చేసిన యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్ల్లాట్లలోకి చెరువులు వస్తున్నాయంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.


అన్ని రికార్డులు పరిశీలిస్తాం: రంగనాథ్‌

ప్లాట్లలో చెరువుల నీళ్లు రావడంపై దృష్టిసారించాం. 1973 నుంచి అందుబాటులో ఉన్న సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల వద్ద ఉన్న రికార్డులు, మ్యాపులు, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశీలన జరుపుతాం. సామర్థ్యానికి మించి చెరువుల్లో నీరు నిలవడంపై నిజానిజాలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తాం. సమగ్ర పరిశీలన తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై ఓ నిర్ణయం తీసుకుంటాం. అన్ని రికార్డులను పరిశీలించాక.. చెరువల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లను నిర్ధారిస్తాం.


ప్రతి సోమవారం ఫిర్యాదులు

కొత్త సంవత్సరం నుంచి ప్రతి సోమవారం(సెలవు రోజులు మినహా) ఫిర్యాదులను స్వీకరించాలని హైడ్రా నిర్ణయించింది. జనవరి 6 నుంచి బుద్ధభవన్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్రీవెన్స్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజలు నేరుగా గానీ, వాట్సాప్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్‌ నంబరు, ఆన్‌లైన్‌ వివరాలను తర్వలో వెల్లడిస్తారు.


5,800 ఫిర్యాదులు

చెరువులు, నాలాలు, రోడ్ల ఆక్రమణలు, పార్కులు, లే అవుట్లలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. వీటిల్లో చెరువులు, పార్కులు, లేఅవుట్లలోని ఖాళీ స్థలాల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. హైడ్రా పరిధిలో లేని ప్రాంతాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 03:44 AM