Share News

Hyderabad: నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల్లోకి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:12 AM

శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

Hyderabad: నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల్లోకి

  • దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం

  • బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయి

  • ఈ ప్రయోగం ఫలిస్తే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో..: సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్‌జెండర్ల ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని, మీరు అంకిత భావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలిస్తాయన్నారు.


ట్రాన్స్‌జెండర్లు పెళ్లిళ్లలో, దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్‌ చేయడం, వ్యభిచారం చేయడం గమనించామని, వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారుతారని సీఎం రేవంత్‌ గుర్తించి, ప్రత్యేకంగా జీవో తెచ్చారన్నారు. ముందుగా ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డు స్థాయిలో వీరి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు సోమవారం నుంచి విఽధులకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అధికారులను సీపీ అభినందించారు.

Updated Date - Dec 23 , 2024 | 07:27 AM