Share News

Child Safety: మఫ్టీలో 200 షీ టీమ్స్‌

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:02 AM

హైదరాబాద్‌లో జరిగే గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం సుమారు 200 మంది షీ టీమ్స్‌ పోలీసులు మఫ్టీలో విధుల్లో ఉన్నారని మహిళా భద్రత, షీటీమ్స్‌ డీసీపీ కవిత ధార తెలిపారు.

Child Safety: మఫ్టీలో 200 షీ టీమ్స్‌

  • హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనంలో డ్యూటీ

  • స్పై కెమెరాలతో ఆకతాయిల చేష్టల రికార్డ్‌

  • 464 మంది పోకిరీల ఆటకట్టించిన పోలీసులు

  • మహిళల భద్రతకు మాది భరోసా: డీసీపీ కవిత

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరిగే గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం సుమారు 200 మంది షీ టీమ్స్‌ పోలీసులు మఫ్టీలో విధుల్లో ఉన్నారని మహిళా భద్రత, షీటీమ్స్‌ డీసీపీ కవిత ధార తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా 12 షీ టీమ్స్‌ నిఘా ఉంచాయని వెల్లడించారు. దీంతో పాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగే శోభాయాత్రలో అదనపు బలగాలు మఫ్టీలో ఉంటాయని చెప్పారు. గణేశ్‌ నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలో 464 మంది పోకిరీల భరతం పట్టినట్లు డీసీపీ తెలిపారు.


ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో మహిళలు, యువతులు, బాలికల పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారని.. అలాంటి ఘటనల్లో పోకిరీలను షీ టీమ్స్‌ పోలీసులు ఫొటోలు, వీడియోలతో సహా పట్టుకున్నారని పేర్కొన్నారు. నగరంలో మహిళలను వేధిస్తున్న, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతున్న పోకిరీలు, ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్స్‌కు స్పై కెమెరాలను అందజేశామని తెలిపారు. పోకిరీల చేష్టలను స్పై కెమెరాల్లో రికార్డు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఆ ఆధారాలతో కోర్టులో శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వెల్లడించారు.


  • మహిళలూ.. ధైర్యంగా ఫోన్‌ చేయండి

ఖైరతాబాద్‌ మహాగణపతి, ఇతర గణేశ్‌ నిమజ్జనాలను వీక్షించడానికి హుస్సేన్‌ సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. వారిలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉంటారు. వారి భద్రత కోసం షీటీమ్స్‌ మఫ్టీలో రంగంలోకి దిగాయి. పోకిరీల వేధింపులను బాధిత మహిళలు మౌనంగా భరించొద్దు. డయల్‌-100, వాట్సాప్‌ నంబర్‌ 9490616555కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. బాధిత మహిళల వివరాలను గోప్యంగా ఉంచుతాం.

-కవిత ధార, డీసీపీ, మహిళా భద్రతా విభాగం

Updated Date - Sep 17 , 2024 | 02:02 AM