Hyderabad: దడ్.. దడ..! భయపెడుతున్న మెట్రోరైలు శబ్ధాలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 10:09 AM
మెట్రోరైలు ఆకాశహర్మ్యానా తిరుగుతున్న సమయంలో శబ్ధం వస్తుండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అన్నట్లుగా స్థానికులు హడలిపోతున్నారు. శబ్ధ కాలుష్యంపై సంబంధిత అధికారులకు గతంలో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
- మితిమీరిన డెసిబుల్స్‌తో ట్రాక్ సమీపవాసుల పరేషాన్
- గతంలో ఫిర్యాదులు అందినా.. పట్టించుకోని అధికారులు
- హైకోర్టు నోటీసులతో తాజాగా అప్రమత్తం
- త్వరలో ధ్వని తీవ్రతపై క్షేత్రస్థాయి పరిశీలన
దడ్.. దడ్.. అంటూ వస్తున్న మెట్రోరైలు(Metro Rail) శబ్దాలకు ట్రాక్ సమీప ప్రాంత వాసులు, కింది నుంచి వెళ్తున్న ప్రయాణికులు హడలిపోతున్నారు. కొన్నిప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల వెంటే ట్రాక్‌ను నిర్మించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతున్న రైళ్ల ధ్వని తీవ్రత వారిని కలవరపెడుతోంది. మెట్రోరైలు శబ్ద కాలుష్యంపై హైకోర్టు వివరణ అడిగిన నేపథ్యంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ సిటీ: మెట్రోరైలు ఆకాశహర్మ్యానా తిరుగుతున్న సమయంలో శబ్ధం వస్తుండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అన్నట్లుగా స్థానికులు హడలిపోతున్నారు. శబ్ధ కాలుష్యంపై సంబంధిత అధికారులకు గతంలో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా సికింద్రాబాద్(Secunderabad) సమీపంలోని బోయిగూడ మెట్రోపిల్లర్ బి1006 వద్ద రైల్వేట్రాక్ వంపులో మితి మీరిన శబ్ధం వస్తోందని డాక్టర్ హనుమాన్లు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మెట్రో అధికారులు అప్రమత్తమమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నివేదికను అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదికూడా చదవండి: రాహుల్ ప్రధాని అయితే.. కులగణనతో రిజర్వేషన్ల పెంపు
గంటకు 80 కిలోమీటర్ల వేగం
ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోరైళ్ల గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లు. ట్రాక్‌ను గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు. సగటు వేగాన్ని గంటకు 33 కిలోమీటర్లతో రూపొందించారు. ప్రస్తుతం మెట్రో ఆపరేటర్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనే రైళ్లను నడిపిస్తున్నారు. భూమి మీద నుంచి దాదాపు 65 అడుగుల ఎత్తులో మెట్రో పిల్లర్లను నిర్మించారు. ఒక పిల్లర్‌కు, మరో పిల్లర్‌కు మధ్య 180 అడుగుల దూరం పాటించారు. ఆ మేరకు ట్రాక్‌ను పటిష్టంగా నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రైళ్లు నడుస్తున్న సమయంలో ట్రాక్‌పై భారీ శబ్దం వస్తుండడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే సమయంలో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు కూడా పిల్లర్లపై నుంచి వస్తున్న ధ్వనితీవ్రతకు హడలిపోతున్నారు.
ఇదికూడా చదవండి: KCR : దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట
ఇప్పుడైనా మేల్కొంటారా..?
దేశంలోని చెన్నయ్ మెట్రోరైళ్లలో ధ్వని తీవ్రత 40 నుంచి 75 డెసిబుల్స్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని రెసిడెన్షియల్ ఏరియాల్లో 55 డెసిబుల్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఏరియాల్లో 75 ఉంది. హైదరాబాద్‌లో మాత్రం అన్ని ప్రాంతాల్లో 80 డెసిబుల్స్ ఉండడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. రైళ్లు స్టేషన్ల వద్దకు చేరుకుంటున్న సమయంలో ధ్వని అధికంగా ఉండడంతో రక్తపోటు పెరుగుతోందని సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్లు తెలిపారు. ధ్వని కాలుష్యంపై హైకోర్టు వివరణ అడిగిన నేపథ్యంలో మెట్రో అధికారులు ఇప్పుడైనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?
Read Latest National News and Telugu News