Share News

Hyderabad: మూసీని పునరుజ్జీవింప చేయాల్సిందే..

ABN , Publish Date - Nov 15 , 2024 | 09:07 AM

మూసీ నదిని పునరుజ్జీవింప చేయాల్సిందేనని మేధావులు, సామాజిక వేత్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే మూసీ ప్రక్షాళన అంటే ఇళ్లు కూల్చడం మాత్రమే కాదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. బాధితుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు.

Hyderabad: మూసీని పునరుజ్జీవింప చేయాల్సిందే..

- ప్రక్షాళన అంటే ఇళ్లు కూల్చడమే కాదు

- మూసీ దుస్థితికి పాలకులే కారణం

- ప్రభుత్వ తొందరపాటుతో సమస్య జఠిలం

- సీపీఐ సెమినార్‌లో పలువురు వక్తలు

హైదరాబాద్‌: మూసీ నదిని పునరుజ్జీవింప చేయాల్సిందేనని మేధావులు, సామాజిక వేత్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే మూసీ ప్రక్షాళన అంటే ఇళ్లు కూల్చడం మాత్రమే కాదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. బాధితుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు.

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘హైడ్రా కార్యకలాపాలు- మూసీ ప్రక్షాళన- బాధితులకు ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సీపీఐ(CPI) ఆధ్వర్యంలో గురువారం సెమినార్‌ నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నో‘డల్‌’ ఆఫీసర్లు బయటకొచ్చారు..


‘ఆంధ్రజ్యోతి’ మాజీ సంపాదకుడు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మూసీ నేటి దుస్థితికి ఒక్కరే కారణం కాదని, గత 70 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రధాన కారణమని అన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా హైదరాబాద్‌ రూపురేఖలు, భవిష్యత్తును నిర్ణయించే విధానాల అమలు వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మూసీని, హైదరాబాద్‌ను విడదీయలేమని, హైదరాబాద్‌ జలవ్యవస్థ అంతా మూసీపైనే ఆధారపడి ఉందన్నారు. మూసీ ప్రక్షాళన వ్యూహాత్మకంగా చేయాలని, అలా కాకుండా ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతామన్న ధోరణి సరికాదన్నారు.


ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) మాట్లాడుతూ.. మూసీని బాగుచేయడం అంటే కేవలం మూసీని మాత్రమే బాగు చేయడం కాదని, నదిపై ఆధారపడిన కుటుంబాలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలన్నారు. ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత అభివృద్ధి నమూనా పెట్టుబడిదారి వ్యవస్థ చుట్టూ తిరుగుతుందన్నారు. ఈ వ్యవస్తే నేడు ప్రభుత్వాలను ముందుండి నడిపిస్తోందన్నారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రభుత్వాన్ని నడుపుతుందన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము ఇచ్చిన సలహాలను ప్రభుత్వం పట్టించుకోకుండా తొందరపాటు చర్యలు చేపట్టడంతో సమస్య జఠిలంగా మారిందన్నారు. మూసీ అభివృద్ధిపై డీపీఆర్‌ తయారు చేసి ప్రజల ముందు పెట్టి విస్తృతంగా చర్చించాలన్నారు.


సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామన్నారు. సెమినార్‌కు అధ్యక్షత వహించిన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మూసీ, హైడ్రా బాధితులను అన్ని విధాల ఆదుకున్న తరువాతనే పనులు చేపట్టాలన్నారు. బాధితులు, మేథావులు, సామాజికవేత్తల నుంచి అభిప్రాయాలు సేకరించి సమగ్ర వివరాలను ఓ నివేదికను సీఎంకు అందజేస్తామని చెప్పారు. సెమినార్‌కు మూసీ నిర్వాసితులు, సామాజిక వేత్తలు, సీపీఐ నాయకులు హాజరయ్యారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 09:07 AM