Share News

Hyderabad: దుండిగల్‌, బాచుపల్లిలో హైడ్రా పర్యటన

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:10 AM

హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా, ఇరిగేషన్‌ అధికారులు

Hyderabad: దుండిగల్‌, బాచుపల్లిలో హైడ్రా పర్యటన

  • చెరువులు, నాలా స్థలాల్లో ఆక్రమణల పరిశీలన

దుండిగల్‌/నార్సింగ్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా, ఇరిగేషన్‌ అధికారులు సోమవారం దుండిగల్‌, బాచుపల్లి మండలాల్లోని చెరువులు, నాలాలను పరిశీలించారు. దుండిగల్‌ మండలంలోని మల్లంపేట్‌ కత్వా చెరువులోకి వచ్చే ప్రధానమైన నాలాకు అడ్డుగా నిర్మించిన గోడను హైడ్రా ఏఈ సారా నేతృత్వంలోని బృందం తొలగించింది. దీంతో నాలా నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. చెరువులో ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు.


బౌరంపేట నుంచి వచ్చే నేరెళ్ల వాగు, ఇసుక డబ్బాల వద్ద ఆక్రమణలను పరిశీలించారు. 5 కి.మీ. పొడవున్న నేరెళ్ల వాగును త్వరలో సర్వే చేయిస్తామని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. బాచుపల్లిలోని కోమటికుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో వెలసిన నిర్మాణాలను హైడ్రా, ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. బాచుపల్లిలోని ఎల్లమ్మ కుంట చెరువు మత్తడి ఆక్రమణను పరిశీలించారు. కాగా, ఉస్మాన్‌సాగర్‌ చుట్టూ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు.

Updated Date - Sep 03 , 2024 | 05:10 AM