Hyderabad: 30 మందికి ఒకే బాత్‌రూమ్...
ABN , Publish Date - May 18 , 2024 | 10:45 AM
మహానగరంలో ఎన్నికల విధులు(Election Duties) నిర్వర్తించిన సిబ్బందిలో కొందరు ఎదుర్కొన్న ఇబ్బందులివి. ‘గతంలో ఈ తరహా సమస్యలు ఎదురయ్యాయి.. మీరు సరైన ఏర్పాట్లు చేయరు.. మేం విధులకు రాము’ అని వినతిపత్రాలిస్తే.. ఇవేం కారణాలు.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. సస్పెండ్ చేస్తామని హడలెత్తించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కనీస వసతుల కల్పనను మాత్రం ఎప్పటిలానే పట్టించుకోలేదు.
- స్నానం చేసేందుకు పడిగాపులు
- చిన్న గదిలో నాలుగు పోలింగ్ కేంద్రాలు
- దుర్వాసనతో కూడిన బిర్యానీ..
- గంజిలాంటి ఉప్మా.. పాచిపోయిన అన్నం
- ఎన్నికల్లో పోలింగ్ సిబ్బంది పడరాని పాట్లు
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు
హైదరాబాద్ సిటీ: మహానగరంలో ఎన్నికల విధులు(Election Duties) నిర్వర్తించిన సిబ్బందిలో కొందరు ఎదుర్కొన్న ఇబ్బందులివి. ‘గతంలో ఈ తరహా సమస్యలు ఎదురయ్యాయి.. మీరు సరైన ఏర్పాట్లు చేయరు.. మేం విధులకు రాము’ అని వినతిపత్రాలిస్తే.. ఇవేం కారణాలు.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. సస్పెండ్ చేస్తామని హడలెత్తించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కనీస వసతుల కల్పనను మాత్రం ఎప్పటిలానే పట్టించుకోలేదు. దీంతో మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సదుపాయాలు లేక రెండు రోజులు నరకం చూశామని ఉద్యోగులు చెప్పారు. మరుదొడ్లు, బాత్‌రూంలు సరిగా/సరిపడా లేకపోవడంతో అవస్థలు పడ్డామని పలువురు ఆంధ్రజ్యోతితో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే భవనంలో నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన అధికారులు.. ఆ స్థాయిలో వసతులున్నాయా..? లేదా అన్నది పట్టించకోలేదు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 25 మంది సిబ్బంది పని చేస్తారు. వారందరికి ఒకటి, రెండు బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ‘15 మందికి ఒకే బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఉంది. దీంతో అర్ధరాత్రి 2 గంటలకు లేచి స్నానం చేయాల్సి వచ్చింది. నిద్ర సరిపోకపోవడంతో పోలింగ్ విధుల నిర్వహణలోనూ ఇబ్బంది పడ్డా’ అని సనత్‌నగర్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పని చేసిన ఓ అధికారి చెప్పారు. పడుకునేందుకు వసతి లేదని, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేక నేల మీద పడుకోవాల్సి వచ్చిందని మరో ఉద్యోగి పేర్కొన్నారు. ’విద్యుత్ అంతరాయంతో ఫ్యాన్ తిరగలేదు. దీంతో రాత్రంతా పడుకోలేకపోయా’ అని చార్మినార్ నియోజకవర్గంలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: కునుకు తీసేందుకు ప్రత్యేక పరికరం...
ఆకలితో అలమటించి..
ఎన్నికల వేళ పోలింగ్ సిబ్బంది ఆకలితో అలమటించారు. ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లిన ఆదివారం.. పోలింగ్ డే సోమవారం.. రెండు రోజులపాటు కడుపు నిండా భోజనం లేక నీరసించారు. పోలింగ్ సిబ్బందికి ఏ ఆహారం ఇవ్వాలన్న దానిపై మెనూ రూపొందించారు. ఉదయం టిఫిన్, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌గా ఏం ఇవ్వాలన్నది పేర్కొన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మజ్జిగ/నిమ్మరసంతోపాటు.. ప్రతి రెండు గంటలకోసారి ఏదైనా ఆహారం ఉండేలా చూసుకోవాలని సూచించారు. పచ్చి కూరగాయలు, సమోసా వంటివీ ఇవ్వాలని మెనూలో ఉంది. పోలింగ్ రోజు మధ్యాహ్నం భోజనంగా ఎగ్ కర్రీ, వెజిటేబుల్‌కర్రీ, చట్నీ, సాంబారు వంటివి ఉండాలి. భోజనంలో పెరుగు తప్పనిసరి. కానీ మెనూ ప్రకారం ఒక్క పోలింగ్ కేంద్రంలోనూ సిబ్బందికి భోజనం అందలేదు. పాచిపోయిన వెజిటేబుల్ బిర్యాని, నీళ్ల ఉప్మా, చారు వంటివి మాత్రమే ఇచ్చారు. చాలా చోట్ల పెరుగు ఊసే లేదు. ఇక పోలింగ్ రోజు ఎండ ఎక్కువగా లేదని నిమ్మరసం/మజ్జిగ వంటివి చాలా చోట్ల ఇవ్వలేదు.
ఇదికూడా చదవండి: Hyderabad: అల్లం వెల్లుల్లి పేస్టు కొంటున్నారా.. ముందు ఇది చూడండి..!
నిధులేమౌతున్నాయ్..?
పోలింగ్ సిబ్బందికి సదుపాయాలు, భోజనానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. ఎన్నికల వ్యయంలో 50 శాతం ముందుగా నిధులు విడుదల చేసేది ఇందుకే. నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన, భోజనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి సంబంధించిన బిల్లులు ఏఆర్‌ఓలు ఆర్ధిక విభాగానికి పంపుతారు. మెనూ ప్రకారం భోజనాలు అందించకుండా.. అవసరమైన సదుపాయాలు కల్పించకుండా కొందరు ఏఆర్‌ఓలు ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. బిల్లులు మాత్రం అన్ని సదుపాయాలు కల్పించినట్టు, మెనూ ప్రకారం భోజనం అందించినట్టు పెట్టి నిధులు కాజేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఓ నియోజకవర్గంలో రూ.2 కోట్లు ఎన్నికల వ్యయం కాగా.. ఇంకొన్ని చోట్ల రూ.4 కోట్లకుపైగా వెచ్చించడం గమనార్హం.
ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News