Drug Smuggling: చిత్రకొండలో సాగు.. లంబసింగి నుంచి సరఫరా
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:33 AM
అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు.
అనకాపల్లి గంజాయి స్మగ్లర్ల ముఠా...
విచారణలో విస్తుపోయే అంశాలు
అడవిలో 20 కిలోమీటర్లు కాలినడకన రహస్య మార్గాల ద్వారా తరలింపు
ఆపై వాహనాల్లో లంబసింగికి గంజాయి రైతులకు పెట్టుబడి..
సాయం చేసి కిలో 1500కు కొనుగోలు
నగరంలో కిలో రూ.25 వేలకు అమ్మకం
హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు. అయితే గంజాయి సాగు చేయడం దగ్గర్నుంచే వీరి ప్రమేయం ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది. లంబసింగి నుంచి హైదరాబాద్‌కు రహస్యంగా గంజాయి సరఫరా చేస్తు న్న అనకాపల్లికి చెందిన ఘరానా స్మగ్లర్ల ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్ న్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ముఠాను పోలీసులు విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మగ్లింగ్ ముఠా నాయకుడు బాలాజీ గోవిం ద్ ఇంటర్‌లోనే చదువు మానేసి హైదరాబాద్ సహా.. ఏపీలో పలు రకాల పనులు చేశాడు. ఆ తరువాత కిరాణా దుకాణం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆంధ్రా-ఒడిసా బోర్డర్‌లోని చిత్రకొండ అటవీ ప్రాంతానికి చెందిన గంజాయి సాగు చేసే రైతులు పరిచయమయ్యారు. దీంతో గంజాయి సాగుకు పెట్టుబడి సాయం తాను చేస్తానని, పండించిన గంజాయిని తనకు రూ.1500కే కేజీ విక్రయించాలని రైతులను కోరాడు. వారికి అవసరమైన డబ్బు సాయం చేసి, తక్కువ ధరకు గంజాయి కొనేవాడు. దానిని ఇతర వ్యక్తులకు రూ.5 వేలకు కేజీ చొప్పున విక్రయించేవాడు. ఇలా కిలోల కొద్దీ గంజాయిని ఇతర ప్రాం తాల నుంచి వచ్చేవారికి విక్రయించడంతో.. గోవింద్ సంపాదన పెరిగిపోయింది. దీనిని గమనించిన అతని స్నేహితులు అదిగల్లి ప్రకాశ్‌కుమార్, మసాలాల మోహన్‌రావు, దుర్గాహరిప్రసాద్, రమణ, మరో ఇద్దరు.. గోవింద్‌తో జత కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
అడవిలో 20 కి.మీ. కాలినడకన..
చిత్రకొండ అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న రైతుల నుంచి కొనుగోలు చేసే గోవింద్ ముఠా.. దానిని అక్కడి నుంచి తరలించేందుకు కూలీలను ఆశ్రయిస్తున్నారు. రహస్య మార్గాల ద్వారా కూలీలు 20 కి.మీ. మేర కాలినడకన గంజాయి మూటలను ఎత్తుకొని, రవాణా మార్గం ఉన్న ప్రాంతానికి తరలించి గోవింద్‌కు అప్పగిస్తుంటారు. అనంతరం గోవింద్ ముఠా అక్కడి నుంచి గుట్టుగా లంబసింగికి తరలిస్తుంటారు. ఇలా.. చిత్రకొండ నుంచి లంబసింగికి తరలించాక గోవింద్ ముఠా సభ్యులు ఎవరి గంజాయిని వారు భద్రపరచుకుంటారు. వ్యాపారుల ఆర్డర్‌ను బట్టి ఎవరి వ్యాపారం వారు చేస్తుంటారు. అయితే హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను బట్టి గోవింద్ ముఠా నేరుగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా లగేజీ బ్యాగుల్లో సర్దుకొని.. వలస కూలీల్లా ఏదో ఓ వాహనంలో ఎక్కి ఒక్కో స్మగ్లర్ 20-25 కేజీల గంజాయిని సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేజీ గంజాయిని రూ.25 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా 2020 సంవత్సరం నుంచి క్వింటాళ్ల కొద్దీ గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.