Share News

Hyderabad: ‘గాంధీ’కి గుర్తింపు.. ప్రశంసాపత్రాల అందజేత

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:06 AM

కొవిడ్‌ సోకింది. దానికి చికిత్స లేదు. ఇక అంతే.. అని బతుకు మీద ఆశలు వదులుకున్న ఎందరికో అప్పట్లో గాంధీ ఆస్పత్రి ఊపిరినిచ్చింది. రాష్ట్రంలో ఏ మూలన కరోనా సోకినా వారు గాంధీకే వచ్చేవారు.

Hyderabad: ‘గాంధీ’కి గుర్తింపు.. ప్రశంసాపత్రాల అందజేత

- కొవిడ్‌ సేవలపై ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ఐసీఎంఆర్‌ ప్రశంసలు

- ప్రశంసాపత్రాల అందజేత

- నవజాత శిశువు నుంచి 103 ఏళ్ల వృద్ధుల వరకు చికిత్సనందించిన ఆస్పత్రి

- 35 వేల మంది పాజిటివ్‌ రోగులకు వైద్య సహాయం

హైదరాబాద్‌ సిటీ: కొవిడ్‌ సోకింది. దానికి చికిత్స లేదు. ఇక అంతే.. అని బతుకు మీద ఆశలు వదులుకున్న ఎందరికో అప్పట్లో గాంధీ ఆస్పత్రి ఊపిరినిచ్చింది. రాష్ట్రంలో ఏ మూలన కరోనా సోకినా వారు గాంధీకే వచ్చేవారు. విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ బాధితులకు ఆస్పత్రి వైద్యులు అందించిన వైద్యసేవలకు గుర్తింపు లభించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రశంసలు లభించాయి. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఓ సమావేశంలో ప్రొఫెసర్‌ రాజారావు(Professor Rajarao), జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ త్రిలోక్‌చందర్‌లను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.


కొవిడ్‌(Covid) నియంత్రణ, నివారణ, ప్లాస్మా చికిత్సలు, కోమార్బిడిటీ బాధితులకు చికిత్సలు, కొవిడ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు తయారు చేసిన 15 ఆర్టికల్స్‌ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అంశాలను పలు దేశాలు పాటించి వైద్య సేవలు అందించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా కేవలం గాంధీ ఆస్పత్రిలోనే కొవిడ్‌ చికిత్సలు ప్రారంభించారు. తర్వాత పూర్తిగా కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చారు. తెలంగాణలో మొదటి కరోనా కేసుకు గాంధీలోనే చికిత్స అందించారు. 1160 పడకల నుంచి 1800కు పెంచారు.

city1.2.jpg


అప్పటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, ఆయాలు, పారిశుధ్య సిబ్బంది రేయింబవళ్లు కష్టించి బాధితులకు సేవలు అందించారు. కుటుంబసభ్యుల మాదిరిగా పర్యవేక్షించారు. నవజాత శిశువు నుంచి 103 ఏళ్ల వృద్ధుడి వరకు కరోనా చికిత్సలను అందించారు. చికిత్స పొందుతున్న బాధితుల వద్ద సహాయకులెవరూ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆస్పత్రి సిబ్బందే అంతా చూసుకోవాల్సి వచ్చేది. తినిపించడం నుంచి దుస్తులు మార్చడం, వారికి ఏదీ అవసరం ఉన్నా వారే సమకూర్చేవారు. ఇలా వేల మందికి మెరుగైన వైద్యం అందించి బాగుచేసి ఇంటికి పంపారు.


35 వేల మంది డిశ్చార్జి..

గాంధీ ఆస్పత్రిని 2020లో నోడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కరోనా వైరస్‌ చికిత్స అందించారు. పాజిటివ్‌ వచ్చిన 35 వేల మంది కరోనా బాధితులకు చికిత్సలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రికి దక్కింది. అత్యంత తీవ్రంగా ఉన్న మరో 15 వేల మందికి చికిత్స అందించారు. కిడ్నీ బాధితులలో 7 వేల మందికి డయాలసిస్‌ నిర్వహించారు. కరోనా వైర్‌సతో బాధపడుతున్న 950 మంది గర్భిణులకు ప్రసవ చికిత్సలు అందించారు. 300 మంది కరోనా బాధితులకు సర్జరీలు చేశారు. 500 మంది పిల్లలకు ప్రత్యేక వైద్యం అందించారు. కోమార్బిడిటీతో బాధపడుతున్న 6 వేల మంది వృద్ధులకు చికిత్సలు చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2024 | 08:06 AM