Hyderabad: బట్టేల్‌గుట్టకు ‘మెట్ల మార్గం’.. త్వరలో అందుబాటులోకి
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:43 AM
బడంగ్‌పేట్ కార్పొరేషన్(Badangpet Corporation) పాత భవనం వెనుక ఉన్న బట్టేల్‌గుట్ట పార్కులోకి వెళ్లడానికి తాజాగా మెట్ల మార్గం ఏర్పాటు చేస్తున్నారు.
- ఈశాన్యం వైపు ఇనుప మెట్లు ఏర్పాటు
హైదరాబాద్: బడంగ్‌పేట్ కార్పొరేషన్(Badangpet Corporation) పాత భవనం వెనుక ఉన్న బట్టేల్‌గుట్ట పార్కులోకి వెళ్లడానికి తాజాగా మెట్ల మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్కులోకి వెళ్లడానికి దగ్గర దారి లేకపోవడం, బడంగ్‌పేట్ శ్మశానవాటిక గేటు పక్కనే పార్కు ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం.. పైగా ఇది రోడ్డుకు దూరంగా ఉండడంతో సందర్శకులు అటు వైపు వెళ్లలేకపోతున్నారు. దాంతో సందర్శకులను ఆకట్టుకుంటుందనుకున్న పార్కు కాస్తా బోసిపోయి కనిపిస్తోంది. అక్కడ ఓ పార్కు ఉన్నదనే విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రధాన రహదారి వైపు నుంచి మరో ప్రవేశద్వారం ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.
ఇదికూడా చదవండి: TS Politics: అనుకన్నట్టుగానే రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు హరీష్.. ఉత్కంఠ
పాత భవనం పక్కనుంచి మెట్ల మార్గం
బట్టేల్‌గుట్ట ఎదురుగా ఉన్న పాత మునిసిపల్ భవనం పక్క నుంచి, గుట్టకు ఈశాన్యం వైపు నుంచి మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. సందర్శకులు సులువుగా గుట్టపైకి వెళ్లేందుకు వీలుగా రెండు, మూడు మలుపులతో, ఏటవాలుగా ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్(ఇనుప)మెట్లు నిర్మించి ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు. మెట్ల మార్గం మొదలయ్యే చోట అందమైన ఆకృతిలో ప్రవేశద్వారం ఏర్పాటు చేసి, దానికి గేటు బిగించనున్నారు. కేవలం ఉదయం, సాయంత్రం వేళ నిర్ణీత సమయాల్లో మాత్రమే తాళం తీసి సందర్శకులను అనుమతించనున్నారు. మరో పక్షం, నెల రోజుల్లో ఈ మెట్ల మార్గం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, పాలకులు యోచిస్తున్నారు. మెట్ల మార్గం పూర్తి నాణ్యతతో, సందర్శకులను ఆకట్టుకునే విధంగా నిర్మించాలని మేయర్ పారిజాతానర్సింహారెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం దాదాపు రూ.పది లక్షలు వ్యయం చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. మెట్ల మార్గం అందుబాటులోకి వస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశమున్నదని అధికారులు భావిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: నగరంలో.. మినీ కశ్మీర్ అందాలు
Read Latest National News and Telugu News