Hyderabad: ఆట మొదలైంది..! సైబరాబాద్‌లో పోలీస్స్టేషన్ల ప్రక్షాళన షురూ...
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:28 AM
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై కమిషనరేట్స్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేశారు.
- 19 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
- కీలక పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోల మార్పు
- ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అవినాష్ మహంతి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై కమిషనరేట్స్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేశారు. ఇకపై ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ రికమెండేషన్స్, ఎమ్మెల్యే లెటర్స్ పని చేయవని, ప్రతిభావంతులకే పట్టం కట్టి పోస్టింగ్‌లు ఇస్తామని సీపీలు ప్రకటించారు. అంతేకాకుండా సైబరాబాద్(Cyberabad) పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పలు పోలీస్ స్టేషన్ల ప్రక్షాళను శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో మాదాపూర్, నార్సింగి, మోకిలా, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, మోయినాబాద్, ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ వంటి పలు కీలక పోలీస్ స్టేషన్‌లతో పాటు.. 19 మంది ఇన్‌స్పెక్టర్‌లను ఒకే సారి బదిలీ చేశారు. కీలక పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలను కూడా మార్చారు.
సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఏడాదిన్నర క్రితం బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతికి కమిషనరేట్‌పై బాగా పట్టుంది. గతంలో నూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు. ఆయననే ఇటీవల సీపీగా నియమించడంలో ఆ అనుభవంతో సీపీగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తన మార్కు పనితీరుతో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. కీలక పోలీస్ స్టేషన్‌లలో ఇన్‌స్పెక్టర్‌లను మార్చడంతో పాటు.. అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు. ఇటీవల ఆర్జీఐ ఎయిర్ పోర్టు, కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్లతో పాటు మియాపూర్‌లో ఓ ఎస్‌ఐను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల మొయినాబాద్, మోకిలా ఇన్‌స్పెక్టర్లను రేంజికి బదిలీ చేశారు.
మాదాపూర్, రాజేంద్రనగర్, బాలానగర్ జోన్ల నుంచి బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లపై పలు కీలకమైన ఆరోపణలు సీపీ దృిష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలానగర్ జోన్ నుంచి బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్‌కు మర్యాదగా మాట్లాడటం రాదని, ఇష్టానుసారంగా సివిల్ తగాదాల్లో తలదూర్చి ప్రత్యర్థులను బెదిరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. మాదాపూర్, రాజేంద్రనగర్ జోన్ నుంచి బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్‌లపై వసూళ్ల దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. దీంతో సీపీ వారిని బదిలీ చేశారు. మిగిలిన జోన్స్‌లో కూడా మరింతమంది ఇన్‌స్పెక్టర్లకు సీపీ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం.
పోస్టింగ్‌లపై కసరత్తు
అల్వాల్, మాదాపూర్, నార్సింగి ఇన్‌స్పెక్టనర్లను బదిలీ చేసి మల్టీజోన్-2కు సరెండర్ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల సరెండర్ అయిన మోకిలా ఇన్‌స్పెక్టర్, సస్పెండైన కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ల స్థానాలతో పాటు.. మాదాపూర్, నార్సింగి పోలీస్ స్టేషన్‌లకు ఎస్‌హెచ్‌వోలను నియమించలేదు. ఆయా పోలీస్ స్టేషన్‌ల పోస్టింగ్‌లపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే నో రికమెండేషన్, నో ఎమ్మెల్యే లెటర్ అని సీపీ ముందే చెప్పడంతో కీలక పోలీస్ స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్‌లుగా ఎవరిని ఎంపిక చేస్తారోనని పోలీస్ సిబ్బందిలో సర్వత్రా ఆసకత్తి నెలకొంది.