CM Revanth Reddy: తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు
ABN , Publish Date - Aug 20 , 2024 | 12:37 PM
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు జరిపారు. సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. రాజీవ్ విగ్రహం వద్ద పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్‌చార్జి మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తుకుతెచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
చేతనైతే రాజీవ్ విగ్రహం ముట్టుకోండి..
‘‘ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి. రాజీవ్ విగ్రహాన్ని ముడితే చెప్పు తెగే దాకా కొడుతాం. రాజీవ్ విగ్రహం ఎవరు ముడుతారో, ఎప్పుడు ముడుతారో చెపితే మా జాగ్గారెడ్డిని పంపిస్తాం. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం. పండగ వాతావరణంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదు. బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు? విగ్రహాన్ని పెట్టేదెప్పుడు. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడుతారా?. తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మీరు చింతమడకకే పరిమితం..
‘‘పొద్దున లేస్తే తాగేవాడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెడుతారా? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. కలలో కూడా నీకు అధికారం రాదు. పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తాం. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం’’ అని అన్నారు.
రాజీవ్‌పై రేవంత్ ప్రశంసలు..
‘‘దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి. విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసినవారు రాజీవ్ గాంధీ. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు. ఒలింపిక్స్‌లో చిన్న దేశం సౌత్ కొరియా కంటే ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. 1921 నుంచి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.